School Holidays List In AP: దాదాపు 50 రోజుల అనంతరం ఈరోజు పాఠశాలలు తెరుచుకున్నాయి. ఏప్రిల్ 24 న విద్యాసంస్థలకు( Educational Institutes) వేసవి సెలవులు ప్రకటించారు. ఈరోజు పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు భుజాన బ్యాగులు వేసుకుని బడిబాట పట్టారు. మళ్లీ బడి గంటల సవ్వడి వినిపిస్తోంది. ఇన్ని రోజులు ఇంటి వద్దే ఆనందంగా గడిపిన విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే కాస్త బాధపడ్డారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో ఎన్ని సెలవులు ఉంటాయంటూ ఎక్కువమంది ఆరా తీయడం కనిపించింది. అయితే సెలవులు తెలుసుకొని విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు.
* పని దినాలు 233
ఏపీలో 316 రోజులపాటు విద్యా సంవత్సరం( academic year ) కొనసాగుతుంది. అయితే ఇందులో పని దినాలు 233 రోజులు మాత్రమే. మిగతా 83 రోజులు సెలవులే. దసరాతో పాటు సంక్రాంతికి వరుసగా సెలవులు వస్తాయి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్, ముస్లిం మైనారిటీ విద్యాసంస్థలకు రంజాన్ సందర్భంగా ప్రత్యేకంగా సెలవులు ఇస్తారు. హిందువులకు అతి ప్రధాన పండగ దసరా. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. డిసెంబర్ 2025 క్రిస్మస్ సందర్భంగా అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులు రానున్నాయి. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థల కు మాత్రం డిసెంబర్ 21 నుంచి 28 వరకు సెలవులు ఇవ్వనున్నారు. ఒక సంక్రాంతికి 2026 జనవరి 10 నుంచి 18 వరకు సెలవులు రానున్నాయి.
* మధ్యలో అప్షనల్ హాలిడేస్..
ఈరోజు నుంచి ఏపీలో( Andhra Pradesh) నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. 2026, ఏప్రిల్ 24 తో ఈ విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఈ మధ్యలోనే పాఠశాలలకు పండుగలు, ప్రత్యేక రోజులు, జాతీయ దినోత్సవాలు, స్థానిక వేడుకల సందర్భంగా సెలవులు వస్తాయి. అధికారికంగా వేసవిలో విద్యాసంస్థలకు సెలవులు వస్తుంటాయి. కానీ ఈ మధ్యకాలంలో వర్షాకాలంలో సైతం విద్యార్థులకు ఆకస్మిక సెలవులు వస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వం ముందస్తుగా విద్యార్థులకు సెలవులు ఇస్తుంది. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు 100 రోజులు వరకు సెలవులు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఈ ఏడాది విద్యార్థులకు సెలవులే సెలవులు అన్నమాట