Sajjala Rama krishnareddy : వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలుగు గారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటి సీఎం జగన్ కు సలహాదారుడుగా వ్యవహరించారు. సకల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఏ శాఖలో నైనా, ఎక్కడైనా మాట్లాడే స్వేచ్ఛను జగన్ సజ్జల వారికి ఇచ్చారు. అందుకే ఆయన పార్టీకి కీలకమైన సోషల్ మీడియా విభాగాన్ని తన కుమారుడు భార్గవ రెడ్డికి రాసి ఇచ్చేశారు. పాలనలోనూ, పార్టీలోనూ గత ఐదేళ్లుగా సజ్జల హవా నడిచింది. పార్టీ అధినేత జగన్ తరువాత తానే అన్నట్టు సజ్జల వారు వ్యవహరించారు.అందుకే రాజకీయ ప్రత్యర్థులకు సైతం టార్గెట్ అయ్యారు. కానీ ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురయ్యేసరికి..రాష్ట్రానికి దూరంగా ఉంటున్నారు. ఏపీలో ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఇప్పటికే జగన్ బెంగుళూరు నుంచి తాడేపల్లి కి షటిల్ సర్వీస్ నడుపుతున్నారు. వచ్చేనెల లండన్ వెళ్లేందుకు సిద్ధపడ్డారు. కోర్టు అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అధినేతే ఉండకపోతే.. తాము ఎందుకు ఉండాలి లే అన్నట్టు పరిస్థితి ఉంది. అందుకే విజయసాయి రెడ్డి సైతం ఓ రెండు నెలల పాటు యూరప్ ట్రిప్ కు వెళ్లాలని భావిస్తున్నారు.ఆయన సైతం న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిద్దరి ప్రయాణాలను అడ్డుకోవాలని చూస్తోంది సిబిఐ. వారం రోజుల్లో వీరికి అనుమతి ఉంటుందా? లేదా? అన్నది తేలిపోనుంది.
* ఆందోళనలో వైసీపీ శ్రేణులు
అయితే కీలక నేతలంతా ముఖం చాటేస్తుండడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనతో ఉన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ ఆరోపించారు. వైసీపీ శ్రేణులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. అయితే అది స్టేట్మెంట్ల వరకే పరిమితం అయింది. అసలు అధినేత ఏపీలోనే ఉండడం లేదని.. భరోసా ఎవరిస్తారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* ఆయన తీరుతో పార్టీకి నష్టం
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంత సజ్జల రామకృష్ణారెడ్డి చూసేవారు. ఆయన తీరుతోనే పార్టీకి నష్టం జరిగిందని నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే పార్టీ వ్యవహారాలన్నీ జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో తూతూ మంత్రంగా సమావేశాలకు హాజరవుతున్నారు. వచ్చామా.. వెళ్ళామా అన్నట్టుగా ఉన్నారు. గతం మాదిరిగా లీడ్ తీసుకోవడం లేదు. అయితే పార్టీ ఓటమికి సజ్జల ప్రధాన కారణమని.. ఆయన డైరెక్షన్లో సాగడం వల్లే ఈ రకమైన ఫలితాలు వచ్చాయని వైసీపీ నేతలు ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఫలితాల తరువాత సజ్జల వైఖరిపై ఫిర్యాదులు రావడంతో ఆయనదూరంగా జరిగిపోయినట్లు తెలుస్తోంది.
* హైదరాబాదు నుంచి రాకపోకలు
ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీలో ఉండడం లేదు. హైదరాబాదులోనే ఉంటున్నారు. సభలు సమావేశాలకు హాజరవుతున్నారు. అంతకుమించి ఎక్కడా కనిపించడం లేదు. తనపై ఆరోపణలు చేశారన్న అవమాన భారంతోనే ఆయన ఏపీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేసుల భయం కూడా ఆయనకు వెంటాడుతోంది. అందుకే అటు పార్టీ శ్రేణులు నమ్మకపోవడం, ఇటు కేసుల భయంతోనే ఆయన ఏపీకి దూరమయ్యారని ప్రచారం జరుగుతోంది.