Sajjala Ramakrishna Reddy: గత ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ తర్వాత ఎక్కువగా వినిపించిన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉండే సజ్జల ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వంలో యాక్టివ్ అయ్యారు. సీఎం ప్రధాన సలహాదారుడిగా, పార్టీ అధికార ప్రతినిధిగా తనదైన ముద్ర వేసుకోవడం ప్రారంభించారు. అప్పటివరకు పార్టీలో విజయసాయిరెడ్డి హవా నడిచేది. జగన్ తర్వాత నెంబర్ 2 గా ఆయన కొనసాగారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సైతం విజయసాయిరెడ్డికి ఎనలేని గౌరవం ఇచ్చేవి.కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటర్ అయ్యాక పూర్తిగా సీన్ మారింది. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తన పాత్ర, పరిధిని పెంచుకుంటూ ముందుకు సాగారు సజ్జల. సకల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఏ శాఖపై అయినా సమీక్షించే హక్కును సొంతం చేసుకున్నారు సజ్జల.చివరకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలన్నా, అంగన్వాడీ సంఘాలతో భేటీలు జరపాలన్నా.. అంతా సజ్జల రామకృష్ణారెడ్డి కొనసన్నల్లో జరిగేవి. కొన్నిసార్లు సంబంధిత శాఖ మంత్రి లేకపోయినా.. సజ్జల సమీక్షించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంతలా ఉండేది ఆయన ప్రాధాన్యం. చివరకు ఈ ఎన్నికల్లో టికెట్లు కట్టబెట్టే బాధ్యత కూడా సజ్జలకే అప్పగించారు జగన్. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కలిసి.. వైసీపీ టికెట్లు కేటాయింపు కోసం ఏకంగా ఇంటర్వ్యూలు జరిపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల ఫలితాల వరకు మీడియాకు దగ్గరగా కనిపించిన సజ్జల.. ఇప్పుడు సడన్ గా కనిపించడం మానేశారు. వైసిపి సమావేశాలకు వస్తున్నా.. మునుపటి హుషారు కనిపించడం లేదు. వచ్చామా, వెళ్ళామా అన్నట్టు ఆయన పరిస్థితి ఉంది.
* నాటి దూకుడేదీ?
జగన్ పై ఎటువంటి విమర్శలు వచ్చినా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించేవారు. మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇచ్చేవారు. చివరకు వైయస్ షర్మిల విషయంలో పార్టీ శ్రేణులు ఎవరు మాట్లాడేవారు కాదు. కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్నాక షర్మిల జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. ఆ సమయంలో మొదట మాట్లాడింది సజ్జల రామకృష్ణారెడ్డి.అది వారి కుటుంబ వ్యవహారమని తెలిసినా.. చొరవ తీసుకొని మరి నాడు విమర్శలు చేశారు సజ్జల. జగన్ వద్ద మార్కులు కొట్టేసేందుకు ఏం చేయాలో అన్నీ చేశారు. చివరకు వైసీపీ సీనియర్లకు కూడా కంటగింపుగా మారారు. అయితే అధికారం ఉన్నప్పుడు దర్పం వెలగబెట్టిన సజ్జల.. ఇప్పుడు ఓటమి తర్వాత గప్ చుప్ అయ్యారు.
* ఆ నిర్ణయాల వెనుక హస్తం
జగన్ హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో జరిగిన కార్యకలాపాలపై సమీక్షిస్తోంది. దీంతో సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవ రెడ్డి పై దృష్టి పెట్టింది. తాను సకల శాఖ మంత్రిగా ఉండడమే కాకుండా వైసిపి కీలకంగా భావించి సోషల్ మీడియా విభాగాన్ని భార్గవరెడ్డి హ్యాండిల్ చేశారు. సోషల్ మీడియా విభాగానికి అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని ముట్టజెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ బయటకు తీసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో తండ్రీ కొడుకులు అలెర్ట్ అయ్యారు. ఓ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.
* కేసుల భయంతోనే..
ప్రస్తుతం కేసుల భయంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. పైగా వైసీపీ ఓటమికి సజ్జల కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ సీనియర్లు సైతం ఆయన పై ఆగ్రహంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా సైలెంట్ అయ్యారు సజ్జల. వైసీపీకి సంబంధించిన ఏ విషయాలను ఆయన సీరియస్ గా తీసుకోవడం లేదు. మొన్న ఢిల్లీలో ధర్నాకు సైతం సామాన్య నేత తరహాలో మాత్రమే కనిపించారు. మునుపటి హడావిడి లేదు. దీంతో సజ్జలపై వైసీపీ శ్రేణుల్లోనే ఒక రకమైన అనుమానం నెలకొంది.