Sajjala : ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం రోజుకో కేసును తెరపైకి తెస్తోంది. ఒకవైపు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఫిర్యాదుల ఆధారంగా చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో అరెస్టులు సంచలనంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి పై కఠిన చర్యలకు దిగుతోంది కూటమి ప్రభుత్వం. ఆయనపై వచ్చిన భూకబ్జా ఆరోపణల విషయంలో సంచలన నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే సజ్జల ఆక్రమించినట్లు ఆరోపణలు రావడంతో రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఏకంగా 63 ఎకరాల భూమిని సజ్జల ఆక్రమించినట్టు తేలడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డికి షాక్ తగిలినట్లు అయ్యింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కీలకంగా వ్యవహరించారు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
Also Read : సజ్జల శ్రీధర్ ఎవరు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం చేశాడు?
* వైసిపి ముఖ్య నేతలపై ఫోకస్..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి ముఖ్య నేతలపై ఫోకస్ పెంచింది. కడప జిల్లా సికే దిన్నె మండల పరిధిలో సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లో అటవీ భూములు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు ఆక్రమిత భూములు ఉన్నాయని తేలడంతో వాటిని స్వాధీనం చేసుకుంది. దాదాపు 220 కోట్ల రూపాయలు విలువచేసే 63.72 ఎకరాలను రెవెన్యూ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న భూమిలో 52 ఎకరాలు అటవీ భూమి ఉన్నట్లు కూడా తేల్చారు. మిగిలిన వాటిని ఇరిగేషన్, అసైన్డ్ భూములుగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఇదివరకే విచారణ జరిపి నివేదిక పంపారు.
* సజ్జల చుట్టూ ఉచ్చు
ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy ) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై భూకబ్జా ఆరోపణల్లో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వం తిరిగి ఆ భూమిని సేకరించడంతో సజ్జలకు షాక్ తగిలినట్లు అయింది. సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో ఆ ఎస్టేట్ ఉంది. అందులో అటవీ శాఖ, ఇరిగేషన్, పేదల భూములు కబ్జా చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. పరిశీలించిన రెవెన్యూ అధికారులు నిజమేనని ధ్రువీకరించారు. అందుకే ఆ భూమిని స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వేనెంబర్ 1629లో ఆక్రమణలో ఉన్న 52.42 ఎకరాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా ఫారెస్ట్ అధికారిని కడప జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదే సమయంలో సర్వే నంబర్ 1626/ 1, 2, 27లో అన్యాక్రాంతానికి గురైన భూములు స్వాధీనం చేసుకోవాలని సికె దిన్నె పంచాయితీ కార్యాలయానికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు సజ్జల ఎస్టేట్లోని ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకున్నారు. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఆర్థిక మూలాలను టార్గెట్ చేసినట్టు అయింది. మున్ముందు ఈ భూముల వ్యవహారంలో అరెస్టుల పర్వానికి కూడా శ్రీకారం చుడతారని ప్రచారం సాగుతోంది.