DCCB Scam : సహకారం’తో రూ.3 వేల కోట్లు కొట్టేశారు

లక్ష్మీనారాయణ ఏకంగా సీబీఐతో పాటు ఈడీకి ఆధారాలతో సహా ఫిర్యాదుచేశారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదుచేయడంతో పాటు నివేదిక అందించారు. ఇప్పటికే జగన్ సర్కారు ఆగడాలపై పోస్టుమార్టం చేస్తున్న నేపథ్యంలో సహకార స్కాం పై ప్రత్యేకంగా దృష్టిసారించే అవకాశం ఉంది.

Written By: Dharma, Updated On : June 17, 2023 10:10 am
Follow us on

DCCB Scam : ఏపీలో మరో స్కాం వెలుగుచూసింది. సహకార శాఖలో రూ.3000 కోట్ల కైంకర్యం జరిగినట్టు తెలుస్తోంది. ఎక్కడికక్కడే బినామీలను పేరుతో డీసీసీబీ బ్యాంకుల నుంచి వందలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసినట్టు సమాచారం. గత రెండేళ్లుగా టీడీపీ నాయకులు పోరాడుతున్నా పెద్దగా ఫలితం లేకపోయింది. కానీ సుదీర్ఘ కాలం సహకార శాఖకు మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన కన్నా లక్ష్మీనారాయణ దీనిపై ఫోకస్ పెంచారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, డీసీసీబీలకు కార్యవర్గాలు లేవు. ప్రభుత్వమే నామినేటెడ్ కింద నియామకాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు పదవులు పంచేసింది. దీంతో వారి అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వైసీపీ చోటా నాయకుల నుంచి బడా నేతల వరకూ బినామీల పేరుతో రుణాలు తీసుకుంటున్నారు. ఒక్క గుంటూరు డీసీసీబీ బ్రాంచ్ లో రూ.500 కోట్లు పక్కదారి పట్టినట్టు తెలుస్తోంది. ఏలూరు బ్రాంచ్ లో అయితే రూ.50 కోట్లు అవినీతికి పాల్పడినట్టు సమాచారం.

సాధారణంగా ఖరీఫ్, రబీ సమయంలో డీసీసీబీలు రైతులకు రుణాలు ఇస్తాయి. ఇటీవల బ్యాంకు లావాదేవీలు పెరిగాయి. రుణ లక్ష్యం వందల కోట్లకు పెరిగింది. అయితే ఇప్పటికే వైసీపీ నేతలు డీసీసీబీలపై రాజకీయ పట్టు పెంచుకున్నారు. స్థానిక బ్యాంకు అధికారులతో కుమ్మక్కై రైతుల పేరిట రుణాలు తీసుకున్నారు. రుణ పరిమితి గడువు దాటుతుండడంతో రైతులకు డీసీసీబీల నుంచి నోటీసులు వెళుతున్నాయి. తాము తీసుకొని రుణాలకు నోటీసులేంటి అని రైతులు అడుగుతుండడంతో అసలు విషయం బయటపడుతోంది.

గత మూడేళ్లుగా ఈ అవినీతి తతంగం నడుస్తోంది. స్థానిక విపక్ష నాయకులు, ప్రజాసంఘాల నేతలు అధికారులకు, పోలీసులకు ఫిర్యాదుచేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏకంగా సీబీఐతో పాటు ఈడీకి ఆధారాలతో సహా ఫిర్యాదుచేశారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదుచేయడంతో పాటు నివేదిక అందించారు. ఇప్పటికే జగన్ సర్కారు ఆగడాలపై పోస్టుమార్టం చేస్తున్న నేపథ్యంలో సహకార స్కాం పై ప్రత్యేకంగా దృష్టిసారించే అవకాశం ఉంది.