CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu) అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ డిజిపి ఆర్పి ఠాకూర్ ను నియమించారు. సీనియర్ ఐపీఎస్ అధికారిగా సుదీర్ఘకాలం సేవలందించారు ఠాకూర్. ఏపీలో వివిధ హోదాల్లో పని చేసిన ఆయన డీజీపీగా కూడా సేవలందించారు. చంద్రబాబుకు నమ్మకస్తుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అందుకే ఈసారి రాజకీయ నేతలకు బదులు సీనియర్ ఐపీఎస్ అధికారిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించారు. ఢిల్లీలో ఉండే ఏపీ భవన్ నుంచి ఆయన పని చేస్తారు. రెండేళ్ల పాటు ఆయన పదవీకాలం ఉంటుంది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చినా.. చివరకు టాకూర్ వైపు చంద్రబాబు మొగ్గు చూపడం విశేషం.
* తొలిసారిగా ఓ అధికారికి
సాధారణంగా ఇప్పటివరకు ఈ పదవిని రాజకీయ నాయకులకు ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. గతంలో ఎక్కువగా కంభంపాటి రామ్మోహన్ రావు( Kambam party Ram Mohan Rao ) ఈ పదవిలో ఉండేవారు. ఈసారి కూడా ఆయనకే ఇస్తారని ప్రచారం నడిచింది. క్యాబినెట్ ర్యాంకుతో కూడిన పదవి ఇది. అయితే ఈసారి కంభంపాటి రామ్మోహన్ రావుకు కాకపోతే.. గల్లా జయదేవ్ కు ఇస్తారని విపరీతమైన ప్రచారం నడిచింది. గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఈ ఎన్నికలకు ముందు రాజకీయాలనుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగుదేశం పార్టీ పై మాత్రం విపరీతమైన అభిమానం చూపుతూ వచ్చారు. అంతకుముందు రెండు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం, పారిశ్రామిక వేత్త కావడంతో ఆయన సేవలను ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా వినియోగించుకోవాలని చంద్రబాబు భావించారు. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో మారుతున్న పరిణామాలు చూసి ఆర్పీ ఠాకూర్ ను( RP Thakur ) నియమించినట్లు ప్రచారం నడుస్తోంది.
* ఎన్డీఏ లో కీలక భాగస్వామి
ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వంలో సైతం బిజెపి భాగస్వామిగా ఉంది. అయితే జాతీయస్థాయిలో బిజెపి ఆలోచన ఒకలా ఉండదు. గత కొద్దిరోజులుగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు తెలుసు. మిత్రపక్షాన్ని నిర్వీర్యం చేయడానికి కూడా బీజేపీ వెనుకడుగు వేయదు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు కనుక.. జాతీయస్థాయిలో ఎంపీల వ్యవహార శైలి, కేంద్రంలో రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకే ఆర్పీ ఠాకూర్ ను చంద్రబాబు నియమించినట్లు తెలుస్తోంది.
* ముందుచూపుతోనే
ప్రస్తుతం బిజెపితో( Bhartiya Janata Party) టిడిపికి ఎటువంటి విభేదాలు లేవు. అయితే పరిస్థితి ఇదే మాదిరిగా కొనసాగుతుందన్న గ్యారెంటీ కూడా లేదు. అటు బిజెపి సైతం చంద్రబాబు తో పాటు నితీష్ కుమార్ పై అనుమానపు చూపులు చూస్తోంది. ఆ ఇద్దరి సాయంతోనే నరేంద్ర మోడీ మూడోసారి ఈ దేశానికి ప్రధాని అయ్యారు. ఇప్పుడు లోక్సభ సభ్యులు మద్దతు కీలకం. అందుకే గత అనుభవాల దృష్ట్యా టిడిపి ఎంపీలను ఆకర్షిస్తారన్న భయం చంద్రబాబులో ఉంది. అదే సమయంలో బిజెపి సైతం చంద్రబాబు విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటుంది. అందుకే ఏమాత్రం తేడా కొట్టినా మూల్యం చెల్లించుకోక తప్పదని చంద్రబాబుకు తెలుసు. అందుకే కేంద్ర నిర్ణయాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని చంద్రబాబుకు చేరవేసే నిఘా వ్యవస్థ అవసరం. అందుకే రాజకీయ పార్టీల నేతలను కాదని.. సీనియర్ ఐపిఎస్ అధికారిని చంద్రబాబు నమ్ముకున్నట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.