RK Kotha Paluku: కెసిఆర్ కుటుంబంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. నాలుగు పవర్ హౌస్ ల మధ్య పోరాటం రసకందాయం లో పడింది. ఇది ఎక్కడ వరకు దారితీస్తుంది.. ఎక్కడి వరకు వెళ్తుందనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కాకపోతే కెసిఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలను ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ ఏ కరువు పెట్టారు. ఆదివారం తన పత్రికలో రాసిన కొత్త పలుకు సంపాదకీయంలో విషయాలు ఏవీ చెప్పకపోయినప్పటికీ.. పాత సీసాలో కొత్తసారా అన్నట్టుగా.. మనకు తెలిసిన సమాచారాన్ని కొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు.
కెసిఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు.. కవిత చేస్తున్న ఆరోపణలు.. కాలేశ్వరం కేసులో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థను ఆహ్వానించిన తీరు.. రేవంత్ వేస్తున్న అడుగులు.. ఇలా అనేక విషయాలను రంగరించి.. తనకు తెలిసిన సమాచారాన్ని అందులో పొందుపరిచి.. రాధాకృష్ణ కొత్త పలుకు రాశారు. సిద్దిపేట ఎమ్మెల్యే ఈ స్థాయిలో ఎదగడాన్ని జాగృతి అధినేత్రి జీర్ణించుకోలేకపోతున్నారని.. అయితే ఆమె సోదరుడు కేటీఆర్.. లేకుంటే తను ఉండాలని అనుకుంటున్నారని రాధాకృష్ణ పేర్కొన్నారు. సంతోష్ కు కూడా ఆ స్థాయి దక్కడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందువల్లే ఆమె మొదట్లో తన సోదరుడితో విభేదించినప్పటికీ.. ఆ తర్వాత ఏకీభవిస్తున్నారని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు. దోచుకున్న సొమ్ములో పంపకాల తేడాల వల్లే ఇదంతా జరుగుతోందని రాధాకృష్ణ ఒక ఆరోపణ మాదిరిగా రాశారు. కెసిఆర్ తన రాజకీయంగా అవసరం ఏర్పడినప్పుడు బాబును బూచిగా చూపించడం.. తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడటం పరిపాటి అని రాధాకృష్ణ కుండబద్దలు కొట్టారు.
కేసీఆర్ మీద.. ఇతర వ్యవహారాల మీద అత్యంత స్వేచ్ఛగా రాసుకుంటూ పోయిన రాధాకృష్ణ.. ఒకవేళ ఇదే పరిణామం చంద్రబాబు కుటుంబంలో గనక జరిగి ఉంటే ఇదేవిధంగా రాసేవారా.. ఇంత స్వేచ్ఛగా వ్యవహరించేవారా.. రాజకీయంగా చంద్రబాబు ఒడిదొడుకులు ఎదుర్కొన్నది వాస్తవం. కెసిఆర్ కూడా అలాగనే ఇక్కడ దాకా వచ్చారు. అలాంటప్పుడు కేసీఆర్లో కనిపిస్తున్న తప్పు.. చంద్రబాబులో రాధాకృష్ణకు ఎందుకు కనిపించడం లేదు. చంద్రబాబు మీద కేసులు పెట్టినప్పుడు కక్షపూరితం అని చెప్పిన రాధాకృష్ణ.. కెసిఆర్ విషయంలో ఆలా ఎందుకు చెప్పలేకపోతున్నారు. ఇలా ప్రతి విషయాన్ని చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. ఇక్కడే తనకు అనుకూలంగా ఉన్న నాయకుడికి ఒక విధంగా.. విరోధంగా ఉన్న నాయకుడికి ఒక విధంగా రాయడమే నేటి జర్నలిజం.