RK Kotha Paluku: జగన్మోహన్ రెడ్డికి, చంద్ర బాబు నాయుడు కు రాజకీయంగా వైరం. అంతకుముందు చంద్రబాబుకు, వైయస్ రాజశేఖర్ రెడ్డి కి రాజకీయ వైరం ఉండేది. రాజశేఖర్ రెడ్డి కన్నుమూసిన తర్వాత.. ఆయన వారసుడిగా జగన్ రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు నాయుడుతో ఢీకొంటున్నారు. ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు సరైన ప్రత్యర్థిగా జగన్ ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
వాస్తవానికి రాజకీయ నాయకులతో మీడియా ఆధిపతులు వైరం పెట్టుకోవడం మనదేశంలో ఇదే తొలిసారి కాదు. కాకపోతే నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరించడమే అసలైన వైచిత్రి. జగన్ అంటే చాలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల అధిపతులు మండి పడుతుంటారు. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ అయితే జగన్ మీద ఒంటి కాలు మీద లేస్తుంటాడు. వాస్తవానికి జగన్, రాధాకృష్ణ మధ్య గెట్టు పంచాయితీలు లేవు. ఇద్దరు కలిసి రాజకీయాలలో పోటీ చేయలేదు.. కనీసం ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు కూడా లేవు. కానీ చంద్రబాబు కంటే ఎక్కువ జగన్ మీద కోపం చూపిస్తుంటాడు రాధాకృష్ణ.
తన పత్రిక ఆంధ్రజ్యోతిలో జగన్ మీద కొన్ని లక్షల కథనాలను వ్యతిరేకంగా రాయించి ఉంటాడు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నాడు. చివరికి తన పేరు మీద ప్రతి ఆదివారం రాసే కొత్త పలుకులో కూడా రాధాకృష్ణ జగన్ మీద మండిపడుతూనే ఉంటాడు. తాజాగా కూడా రాధాకృష్ణ జగన్ మీద బీభత్సంగా రాసేశాడు. తను రాసే కొత్త పలుకులో జగన్మోహన్ రెడ్డిని తూర్పార పట్టాడు. జగన్ తప్పు చేశాడని.. జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఘోరాలు జరుగుతున్నాయని.. గతంలో అతడు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యవహారాలు జరిగాయని ఏకంగా ఒక దర్యాప్తు సంస్థకు మించి లోతైన విచారణ సాగించాడు రాధాకృష్ణ. అంతేకాదు స్కిల్ వ్యవహారాన్ని చంద్రబాబు మీద పెట్టిన దురుద్దేశమైన కేసు అని తీర్మానించాడు రాధాకృష్ణ.
వాస్తవానికి ఒక కేసులో విషయాలను దర్యాప్తు సంస్థలు బయటపెడుతుంటాయి. మీడియా ఆ విషయాలను వార్తల రూపంలో ప్రజలకు తెలియజేయాలి. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం కనుక ఆ మీడియా యాజమాన్యం కొనసాగిస్తే అందులో ఉన్న విషయాలను పట్టిష్టమైన ఆధారాలతో బయటపెట్టాలి. అంతేతప్ప గాలికి కొట్టుకుపోయే పేలపిండి మాదిరిగా వార్తలను రాయకూడదు. పరకామణి చోరీ, లడ్డులో కల్తీ నెయ్యి.. ఇలా ప్రతి విషయంలోనూ రాధాకృష్ణ దర్యాప్తు సంస్థ మాదిరిగా జగన్ మీద అడ్డంగా రాసేశాడు. ఇన్ని విషయాలు రాధాకృష్ణ చెప్పిన తర్వాత.. కూటమి ప్రభుత్వం జగన్ ను జైల్లో వేయకుండా ఎందుకు వెనుకాడుతున్నట్టు?!