RK kotaa paluku : ఒకప్పుడు మీడియాను విశ్వసనీయత ఉన్న వ్యక్తులు నిర్వహించారు కాబట్టి అది ఆశ్రిత పక్షపాతం లేకుండా ఉండేది. సమాజహితంగా వార్తలను రాసేది. ప్రభుత్వాలు దారితప్పినప్పుడు చర్నా కోల్ తో కొట్టేది.. నిగ్గదీసి అడిగి.. అగ్గి తోటి కడిగేది.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి వస్తుందని నమ్మకం కూడా లేదు. ముఖ్యంగా తెలుగు నాట మీడియా వ్యక్తులను మోసే వ్యవస్థగా మారిపోయింది. రాజకీయ పార్టీలకు డప్పు కొట్టే వ్యవహారంగా రూపాంతరం చెందింది. ఇది ఎంతకు దిగజారుతుందో తెలియదు కానీ ఇప్పటికైతే పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. మీడియాలో వచ్చే వార్తను ఎవరూ నమ్మలేని పరిస్థితి నెలకొంది. అయితే మీడియా ఇలా మారిపోవడానికి కారణమేంటి? వ్యక్తులకు భజన చేసే వ్యవస్థగా మారిపోవడానికి వెనుక ఏం జరిగింది? అనే ప్రశ్నలకు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ సమాధానం చెప్పారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే?
వారి వల్లేనట!
తెలుగు నాట మీడియా 2 వర్గాలుగా విడిపోవడానికి ప్రధాన కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కెసిఆరే నట. అంటే అంత ముందుకు మీడియా బాగానే ఉండేదా. బాగా ఉన్నప్పుడు ఉదయం పత్రిక మీద ఈనాడు ఎలా దాడి చేసింది? ఈనాడులో దాసరి నారాయణరావు వార్త ఒక్కటి కూడా పబ్లిష్ కాకుండా ఎలా తొక్కి పెట్టింది? వార్త పత్రిక ఎదుగుతుంటే ఈనాడు ఎలా అడ్డుకుంది? ఎలా ప్రతిఘటించింది? ఇవన్నీ ఎవరికి తెలియవు. అక్కడిదాకా ఎందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సాక్షి తీసుకొచ్చేదాకా మీడియాలో జీతాలు ఎలా ఉండేవి? ఆంధ్రజ్యోతిలో జీతాలు ఎలా ఉండేవి? 11వ తారీఖు అది కూడా అకౌంటెంట్ ముందు ఉద్యోగులు జీతాల కోసం క్యూలో ఉండేవారు. ఆరోజు డబ్బులు లేకపోతే మరుసటి రోజు తీసుకునేవారు. కొన్ని సందర్భాల్లో అది 20వ తారీకు దాకా వచ్చేది. సాక్షి పత్రికను వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎలా పెట్టారు? నిధుల సమీకరణ ఎలా జరిగింది? అనే విషయాలను పక్కనపెడితే సాక్షి వచ్చిన తర్వాత కదా మీడియాలో ఉద్యోగులకు జీతాలు పెరిగింది. కెసిఆర్ “నమస్తే” ను స్వాధీనం చేసుకున్న తర్వాతే కదా.. ఆయా పత్రికలలో తెలంగాణ వారికి సముచిత ప్రాధాన్యం లభించింది. ఆ విషయాన్ని మర్చిపోయి రాధాకృష్ణ తన అక్కసు వెళ్ళగక్కడమేమిటో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ వైఎస్ సాక్షిని గాని, కెసిఆర్ నమస్తే తెలంగాణను గాని శుద్ధ పూసలని మేము చెప్పడం లేదు. అవేవీ సర్వ పరిత్యాగులు అని భావించడం లేదు. కాకపోతే మీడియా గురించి వారి ప్రస్తావనను రాధాకృష్ణ చెప్పడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తోంది.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఎలాంటి రాతలు రాసింది? కనీసం ప్రభుత్వంలో జరిగిన మంచిని కూడా చెప్పలేకపోయింది. కెసిఆర్ విషయంలోనూ రాధాకృష్ణ మొదట్లో వ్యతిరేక ధోరణి ప్రదర్శించింది నిజం కాదా.. ఆ తర్వాత అనుకూల వైఖరి అవలంబించింది అబద్ధమా? ఆయత చండీయాగం నిర్వహించినప్పుడు రాధాకృష్ణ కెసిఆర్ వద్దకు వెళ్ళింది యదార్థమే కదా. అలాంటప్పుడు మీడియా విషయంలో కెసిఆర్ ను విమర్శించే నైతికత రాధాకృష్ణకు ఉందా? మీడియాలో జర్నలిస్టులు లేరు, ఎర్నస్టులు మాత్రమే ఉన్నారని రాధాకృష్ణ చెబుతున్నారు. అలాంటప్పుడు తన ఛానల్ నిర్వహించే డిబేట్ కార్యక్రమాలలో కేవలం ఒక పార్టీకి అనుకూలమైన వారిని ఎందుకు పిలుస్తున్నారు? రాధాకృష్ణ ఈ విషయంలో న్యూట్రాలిటీని ప్రదర్శించి.. మిగతా వారిని ప్రశ్నిస్తే బాగుండేది.. కెసిఆర్ ఫోన్ టాపింగ్, జగన్ నరుకుడు భాష.. చంద్రబాబు సూక్తి ముక్తావళితో సాగిపోయింది ఆదివారం నాటి రాధాకృష్ణ కొత్త పలుకు!