Amaravati: అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉంది. రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయలను అందించనుంది. బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేయనుంది. ఇంకోవైపు సొంతంగానే రాష్ట్ర ప్రభుత్వం మరో 12 వేల కోట్లు సమీకరించనుంది. మరోవైపు మరో 15 వేల కోట్ల రూపాయలు రుణం రూపంలో తీసుకోనుంది ఏపీ సర్కార్. ఈ మొత్తంతో అమరావతికి తుది రూపం తీసుకురానుంది.అయితే ఇప్పుడు రాష్ట్రస్థాయిలో ఎటువంటి వేడుకలు నిర్వహించాలన్నా.. అందుకు అమరావతిని వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. చివరకు సినిమా ఈవెంట్లకు సంబంధించి నిర్వహణకు అనుమతులు ఇవ్వడానికి సిద్ధపడుతోంది. ఇటువంటి తరుణంలో అమరావతి లోనే రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిగా ఎంపిక చేసి తొమ్మిదేళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా రాష్ట్రస్థాయి వేడుకలను నిర్వహించలేదు. అందుకే ఈసారి అక్కడే ప్రతిష్టాత్మకంగా రిపబ్లిక్ డే వేడుకలు జరపాలని డిసైడ్ అయ్యింది. ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయనుంది. ఇందుకు సంబంధించి స్థల సేకరణలో నిమగ్నమై ఉంది.
* స్థలాల పరిశీలన
అమరావతిలో చాలా రకాల ప్రదేశాలను రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణకు పరిశీలిస్తున్నారు. రాయపూడి సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ల సమీపంలో ఎన్నార్టీ టవర్స్ కు వెళ్లే మార్గంలో ఉన్న స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం. సిఆర్డిఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మి, సీఎమ్ఓ కీలక అధికారులు స్థల పరిశీలన చేశారు. అక్కడ ఉన్న పరిస్థితులపై ప్రభుత్వానికి ఒక నివేదిక అందించనున్నారు.
* బాలకృష్ణ ఈవెంట్
మరోవైపు అమరావతిలో బాలకృష్ణ నటించిన సినిమా ఈవెంట్ ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల కిందట అమరావతి రాజధాని నిర్మాణ ప్రాంతాన్ని బాలకృష్ణ పరిశీలించారు. అయితే అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 2018లో అప్పటి టిడిపి ప్రభుత్వం భూమిని కేటాయించగా.. లీజుకు సంబంధించిన మొత్తాన్ని ఇప్పటికే బాలకృష్ణ ప్రభుత్వానికి చెల్లించారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ ముందుకు వచ్చారు. అందుకే స్థల పరిశీలన చేశారు. మరోవైపు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఈవెంట్ కు సంబంధించి అమరావతిలో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. దీనిపై ఇంతవరకు క్లారిటీ లేదు. అయితే అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం ద్వారా కొత్త సంకేతాలను ప్రపంచానికి పంపించింది ఏపీ సర్కార్.