Kodali Nani: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సూపర్ విక్టరీ సాధించింది. జనసేనతో పాటు బిజెపితో జతకట్టి వైసీపీని చావు దెబ్బతీసింది. వై నాట్ 175 అని నినాదం చేసిన వైసిపికి కేవలం 11 స్థానాలకే పరిమితం చేసింది.కనీసం ప్రతిపక్ష హోదా కూడా పార్టీకి దక్కలేదు. గత ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో ఈ భారీ విజయం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త స్తైర్యాన్ని నింపింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది.కానీ కొన్ని అంశాల్లో టిడిపి శ్రేణులకుఆశించిన స్థాయిలో సంతృప్తి దక్కలేదు. ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో టిడిపి శ్రేణులతో పాటు అధినేతను ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. అది నిజంగా టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన అసంతృప్తికి కారణమవుతోంది. ముఖ్యంగా కొడాలి నాని అంటే టిడిపి శ్రేణులకు విపరీతమైన కోపం. ఆయన చేసిన వ్యాఖ్యలు, అధినేత చంద్రబాబుపై విరుచుకుపడే విధానాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఆయనకు గట్టిగానే బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. వెంటాడి వేటాడి కేసులతో ఇరికించాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేదు. అయితే తప్పు చేసిన వారు తప్పకుండా అనుభవించక తప్పదని లోకేష్ పదేపదే హెచ్చరిస్తున్నారు. రెడ్ బుక్ లో నమోదైన ప్రతి ఒక్కరు పై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. అయితే కొడాలి నాని వంతు ఎప్పుడు వస్తుందా అని టిడిపి శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి.
* బలమైన కేసులతో
ఒకటి రెండు రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చే కేసులు కంటే.. కొడాలి నాని పై బలమైన కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో ఆయన జగనన్న ఇళ్ల విషయంలో చేసిన తప్పిదాలను గుర్తించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. మరోవైపు కొడాలి నాని ముఖ్య అనుచరులపై ఫోకస్ పెరిగింది. అప్పటి బినామీలపై పూర్తిగా దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ముందుగా వారి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తరువాత కొడాలి నాని పని పట్టనుంది.అంటే గట్టి స్కెచ్ తో ఉందన్నమాట.ఇప్పటికే కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీ పై కూడా పూర్తిగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. పోలవరం గట్టు నుంచి మట్టి తవ్వకాలు చేపట్టి 100 కోట్లు పోగేసుకున్నారని వంశీ పై ఆరోపణలు ఉన్నాయి. బినామీలతో మట్టిని తవ్వి పెద్ద ఎత్తున సొమ్మును పోగు చేసుకున్నారన్న విమర్శ ఉంది. దానిని బయటకు తీసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం.
* అజ్ఞాతంలో ఫైర్ బ్రాండ్ నేత
ఎన్నికల ఫలితాల అనంతరం కొడాలి నాని గుడివాడ వైపు చూడడం లేదు. ఒకటి రెండుసార్లు తాడేపల్లి ప్యాలెస్ లో కనిపించారు. తరువాత కనిపించకుండా మానేశారు. ఆయన ఎక్కడ ఉన్నారనేది ప్రధాన నేతలకే తెలుసు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని కి బుద్ధి చెప్పాలని సగటు టిడిపి శ్రేణులు కోరుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వచ్చి అలా బెయిల్ తెచ్చుకునే కేసు కాకుండా.. స్ట్రాంగ్ కేసు ఆయనపై పెట్టి.. కార్యకర్తల ఆకాంక్షలను తీర్చాలని టిడిపి హై కమాండ్ భావిస్తోంది. మరి కొడాలి నాని చిక్కుతారా? లేదా? టిడిపి శ్రేణుల కల నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాలి.