Relief to CM Jagan : జగన్ అండ్ కోకు కేసుల్లో ఉపశమనం..కారణాలు అవేనా?

తాజాగా ఈడీ వేసిన పిటీషన్ విచారణకు వచ్చింది. కానీ ఈడీ వాదనలకు భిన్నంగా కోర్టు స్పందించింది. పిటీషన్ ను కొట్టివేసినట్టు తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : July 15, 2023 6:09 pm
Follow us on

Relief to CM Jagan : ఏపీ సీఎం జగన్ కు అన్నీ మంచి శకునల్లా ఉన్నాయి. కోర్టు కేసుల్లో వరుసగా ఉపశమనం లభిస్తోంది. ఉక్కిరిబిక్కిరి చేస్తుందనుకున్న బాబాయ్ వివేకా హత్య కేసులో కాస్తా హీట్ తగ్గింది. కొంచెం ఉపశమనం లభించింది. ఇప్పుడు సతీమణి భారతిపై ఉన్న ఈడీ కేసును సుప్రీం కోర్టు ఏకంగా కొట్టేసింది. దీంతో జగన్ కు ఎన్నికల ముంగిట ఊరటలు కలిసి వస్తున్నాయి. ఆయనకు అలా కలిసి వస్తోందా? కలిసి వచ్చినట్టు చేస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. వరుస ఢిల్లీ పర్యటనలతోనే ఈ ఉపశమనలా? అన్న అనుమానాలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి.

సీఎం సతీమణి భారతిపై ఈడీ కేసులు నమోదుచేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో కొన్ని ఆస్తులను సైతం జప్తు చేశారు. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు తెలంగాణ హైకోర్టును సంప్రదించారు. ఈడీ జప్తు చేసిన ఆస్తులకు ప్రత్యామ్నాయంగా వాటికి సమాన విలువైన నగదు డిపాజిట్లు సమర్పించేందుకు  అనుమతిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును ఎన్  ఫోర్స్  మెంట్  డైరెక్టరేట్  సుప్రీం కోర్టులో సవాల్  చేసింది. తాజాగా ఈడీ వేసిన పిటీషన్ విచారణకు వచ్చింది. కానీ ఈడీ వాదనలకు భిన్నంగా కోర్టు స్పందించింది. పిటీషన్ ను కొట్టివేసినట్టు తెలుస్తోంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏ స్థాయిలో ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తరువాత కీలక నేత పేరు వెల్లడయ్యే అవకాశమున్నట్టు ప్రచారం సాగింది. అందుకు తగ్గట్టుగానే తాడేపల్లిలో హడావుడి నడిచింది. ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి అస్వస్థత, కర్నూలు ఆస్పత్రి ఎపిసోడ్.. ఇలా ఒకటేమిటి చాలా రకాల ఎపిసోడ్లు నడిచాయి. వైసీపీ శ్రేణులను ఆందోళనలో నెట్టేశాయి. కానీ ఎప్పుడైతే అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరైందో అప్పటి నుంచి కేసులో స్తబ్ధత నడుస్తోంది.

సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి విపక్షాల నుంచి తరచూ ఒక మాట వినిపిస్తుంటుంది. హైకమాండ్ పెద్దలతో ఏకాంత భేటీపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతుంటాయి. సీఎం కలిసేది తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమేనంటూ విపక్షాలు ఆరోపిస్తుంటాయి. మొన్నటికి మొన్న పెద్దలను కలిసినప్పుడు ఇదేరకం ఆరోపణలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే కేసుల్లో ఉపశమనాలు వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే  అవి యాదృశ్చికంగా జరుగుతున్నాయా? లేకుంటే విపక్షాలు ఆరోపణల్లో నిజం ఉందా? అన్నది దేవుడికే ఎరుక.