YCP: వైసీపీలో టిక్కెట్ల కాక రేగింది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి జగన్ వివాదాలకు ఆజ్యం పోశారు.’ నియోజకవర్గంలో నీ పరిస్థితి బాగాలేదు. వ్యతిరేకత ఎక్కువగా ఉంది. టిక్కెట్ ఇస్తే ఓడిపోతావు. అందుకే తప్పుకో. పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా న్యాయం చేస్తాను ‘ అంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేల ముఖం మీద చెబుతుండడంతో బాధితులకు మైండ్ బ్లాక్ అవుతోంది. మర్యాద లేనిచోట ఉండడం ఎందుకు అంటూ.. నేతలు ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. దీంతో అధికార పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. పార్టీ శ్రేణులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిల పంచన చేరారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సైతం తన రూటు అటేనంటూ సంకేతాలు ఇస్తున్నారు.కడప జిల్లాలో ఎమ్మెల్సీ రామచంద్రయ్య అనూహ్యంగా టిడిపి గూటికి చేరారు. విజయ్ సాయి రెడ్డి కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది. ఇక చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తాడోపేడో అన్న నిర్ణయానికి వచ్చారు. మరికొందరు ప్రత్యర్థి పార్టీలో అవకాశాలు బట్టి పావులు కదపాలని భావిస్తున్నారు. మొత్తానికైతే తేనె తుట్టను కదిపి.. జగన్ నొప్పిని భరిస్తున్నారు. మార్పు అనే సంకేతంతో పార్టీని అయోమయంలో పడేస్తున్నారు.
మొన్నటివరకు వైసీపీలో జగన్ చెప్పిందే వేదం.. ఆయనపై ఈగ వాలనిచ్చేవారు కాదు పార్టీ శ్రేణులు. నాలుగున్నర ఏళ్లుగా అదే క్రమశిక్షణతో కొనసాగిన నేతలు.. ఇప్పుడు ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. గట్టిగా నోరు విప్పుతున్నారు. టికెట్ దక్కదని తెలియగానే అధినేత అని చూడకుండా కస్సుబుస్సు లాడుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు జగన్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు గోరంట్ల మాధవ సైతం రుస రుసలాడుతున్నట్లు తెలుస్తోంది. హిందూపురం టికెట్ తనకు ఎందుకు ఇవ్వరని ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించినట్లు సమాచారం. మల్లాది విష్ణు అనుచరులైతే ఇంతలా మోసం చేస్తారా? అంటూ ఆక్రోశం వ్యక్తం చేసినట్లు సమాచారం. మొత్తానికైతే మొన్నటి వరకు గౌరవభావంతో చూసినవారే.. ఇప్పుడు జగన్ అంటే ఆగ్రహంతో ఊగిపోవడం విశేషం.