Raghu Rama Krishna Raju
Raghu Rama Krishna Raju: వైసిపి ఊపిరి పీల్చుకుంది. ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఘాటైన లేఖ రాశారు. గెలిచిన ఆరునెలలకే పార్టీకి రఘురామకృష్ణంరాజు దూరమయ్యారు. జగన్ తో పాటు వైసిపికి కంటిమీద కునుకు లేకుండా చేశారు. అదే సమయంలో వైసీపీ సర్కార్ కేసులతో ఆయనను వెంటాడింది. పుట్టినరోజు నాడే ఏపీ సిఐడి హైదరాబాదు వెళ్లి రఘురామరాజును గుంటూరుకు తీసుకొచ్చింది. ఈ క్రమంలో తనపై సిఐడి అధికారులు చేయి చేసుకున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు రఘురామకృష్ణంరాజు. అటు ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వైసిపి చేయని ప్రయత్నం అంటూ లేదు. అదే సమయంలో రఘురామకృష్ణంరాజు సైతం జగన్ పై విరుచుకుపడుతూనే ఉండేవారు. అయితే ఇప్పుడు ఎన్నికల ముంగిట తనకు తానుగా పార్టీకి రాజీనామా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వైసిపికి విముక్తి కల్పించారు.
2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు పోటీ చేశారు.జనసేన అభ్యర్థి నాగబాబుపై విజయం సాధించారు. అయితే గెలిచిన ఆరు నెలలకే జగన్ విధానాలను రఘురామ ప్రశ్నించారు. దీంతో హై కమాండ్ ఆయన్ను పక్కన పెట్టింది. దీంతో రఘురామ పార్టీతోపాటు జగన్ పై విమర్శల డోసును పెంచారు. టిడిపి అనుకూల మీడియా డిబేట్లో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు కురిపించేవారు. ఈ నేపథ్యంలో రఘురామపై రాజ ద్రోహం కేసు నమోదు చేస్తూ.. ఏపీ సిఐడి అరెస్టు చేయడం సంచలనంగా మారింది. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి రఘురామ న్యాయం పొందారు. మరోవైపు జగన్ తో పాటు వైసీపీ నేతల అవినీతిపై న్యాయపోరాటం చేస్తున్నారు. ప్రతిరోజు ఎల్లో మీడియా వేదికగా జగన్ టార్గెట్ చేసుకోవడమే రఘురామ పనిగా పెట్టుకున్నారు.
జాతీయస్థాయిలో రఘురామకు గట్టి పట్టు ఉంది. బిజెపి అగ్రనేతలతో పరిచయాలు ఉన్నాయి. అందుకే వైసీపీ నేతలు చాలాసార్లు అనర్హత వేటువేయడానికి ప్రయత్నించారు. కానీ ఢిల్లీ పెద్దలనుంచి సానుకూలత రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. పార్టీ నుంచి రాజీనామా చేసిన మరుక్షణం రఘురామ మరింత వాయిస్ పెంచుతారని.. స్వేచ్ఛ ఇచ్చినట్టు అవుతుందని వైసిపి హై కమాండ్ భావించింది. అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా కొనసాగించింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో రఘురామ తనకు తానుగా రాజీనామా ప్రకటించారు.కేవలం పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు. ఎంపీగా కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
తెలుగుదేశం, జనసేన, బిజెపి ఒకే తాటి పైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ మూడు పార్టీల కూటమి వెనుక రఘురామ కృషి కూడా ఉందని తెలుస్తోంది. ఆ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరి నరసాపురం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు రఘురామ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. పొత్తులు, సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రావడంతో.. వైసీపీకి రఘురామ రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్నది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.