Reallocation Constituencies: ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం తప్పలేదు. మున్ముందు ఆ పార్టీ ఎన్నో సంక్షోభాలను అధిగమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనను టిడిపి కూటమి సర్కార్ పునః సమీక్షించే అవకాశం ఉంది. ప్రతి నిర్ణయంలో లోపాలు వెతికే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మద్యం వంటి భారీ కుంభకోణంలో జగన్ తో పాటు కీలక నేతల పాత్రను టిడిపి సర్కార్ బయట పెట్టే అవకాశం ఉంది. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు వంటి అంశాల్లో భారీ లోపాలు ఉన్నాయి. అయితే ఒక్క కేసులతోనే కాదు.. వైసిపి నిర్వీర్యమయ్యే ఏ చిన్న అవకాశాన్ని చంద్రబాబు విడిచిపెట్టారు. అది జగన్ కు కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా లభించనుండడంతో చంద్రబాబు తన బుర్రకు పదును పెడతారు. అయితే అన్నింటికీ మించి నియోజకవర్గాల పునర్విభజన వైసీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
చివరిసారిగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2006లో ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ గవర్నమెంట్ పాలన సాగిస్తోంది. ఆ సమయంలోనే టిడిపి కీలక నేతల నియోజకవర్గాల రిజర్వేషన్లు పూర్తిగా మారిపోయాయి. తెలుగుదేశం పార్టీకి గట్టిపట్టున్న నియోజకవర్గాల్లో చీలిక తెచ్చి విడగొట్టారు. టిడిపికి బలం లేకుండా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఆయన చంద్రబాబు కనుక. గత ఐదు సంవత్సరాలుగా ఆయనను వైసీపీ సర్కార్ ఎంతలా వేటాడిందో తెలుసు. అందుకే ఈ చిన్న అవకాశాన్ని సైతం ఆయన విడిచిపెట్టరు. ఇది ముమ్మాటికీ నిజం.
ఎప్పటికప్పుడు మారిన జనాభా లెక్కల ప్రకారం.. లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్విభజించేందుకు పునర్విభజన కమిషన్లు ఏర్పడ్డాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను సైతం ఎప్పటికప్పుడు రొటేట్ చేస్తుంటారు. దీనినే ఆసరాగా తీసుకొని.. రాజకీయ ప్రత్యర్థులను పలుచన చేసేందుకు.. వారి నియోజకవర్గాలను బలహీనం చేసేందుకు అధికార పక్షం తప్పకుండా ప్రయత్నాలు చేస్తుంది. ఈ లెక్కన వైసీపీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న కీలక నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు చేస్తారన్న అనుమానాలు చాలా రకాలుగా ఉత్పన్నమవుతున్నాయి. చివరిగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఆశ్చర్య పడాల్సిన పని లేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకే నియోజకవర్గంలో శాశ్వతంగా ఎస్సీ లేక ఎస్టీ రిజర్వు అవ్వకుండా ఉండేందుకు రొటేషన్ పద్ధతిలో రిజర్వ్డ్ నియోజకవర్గాలను మారుస్తూ ఉంటారు.
ఈ పునర్విభజన కమిషన్ ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఇందులో సభ్యులుగా ఉంటారు. కమిషన్ తీసుకునే నిర్ణయాలను సవాల్ చేసే వీలు ఉండదు కూడా. 2009లో నియోజకవర్గాల పునర్విభజన పై తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు తెలిపింది. మొత్తం అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ఆరోపణలు చేసింది. టిడిపిని దెబ్బతీసే విధంగా నియోజకవర్గాల పునర్విభజన ఉందని చెప్పుకొచ్చింది. అయితే ఒక్క తెలుగుదేశం పార్టీకాదు దేశవ్యాప్తంగా శివసేన, సమాజ్ వాది వంటి పార్టీలు పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినా అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. ఇప్పుడు కూడా వైసిపి పై పునర్విభజన ప్రక్రియ ప్రభావం చూపే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.మరీ ముఖ్యంగా పులివెందుల ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా మారిపోతుందన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే తప్పకుండా కుప్పం నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుడ్ గా మార్చి ఉండేవారని టిడిపి సానుభూతిపరులు అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. పునర్విభజనతో 175 నియోజకవర్గాలు ఉన్న ఏపీ.. మరో 50 నియోజకవర్గాలను పెంచుకొని 225 కు చేరుకోనుంది. 119నుంచి తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య 153 కు చేరుకోనుంది.