Global Disaster: ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే.. ఏదైనా ఆస్టరాయిడ్ ఢీకొంటేనో.. భూమి మీద ఉన్న జీవరాశులు చాలా వరకు నామరూపాలు లేకుండా పోతాయి. అయితే ఎంతటి ప్రళయం వచ్చినా.. ఈ ఐదు రకాల జీవులు మాత్రం బతికే ఉంటాయట. వాటికి ఉన్న ప్రత్యేక లక్షణాలు, కఠిన పరిస్థితులను తట్టుకోగల సామర్థ్యమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మరి ఆ ఐదు జీవులు ఏంటి.. వాటి ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
టార్టిగ్రేడ్‌లు..
జీవులన్నింటిలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకుని బతకగలిగే అతి చిన్న జీవులు టార్టిగ్రేడ్‌లు. ఇవి నీటిలో జీవిస్తుండడం, ఎలుగుబంటిని పోలి ఉండడంతో వీటిని వాటర్ బేర్‌లు అని కూడా పిలుస్తారు. 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను, మైనస్ 70 డిగ్రీల వరకు తీవ్ర చలిని కూడా ఇవి తట్టుకుంటాయి. ఆక్సిజన్, ఆహారం, నీళ్లు లేని పరిస్థితుల్లోనూ వారాలకు వారాలు బతికేస్తాయి. అందుకే ప్రళయమొచ్చినా బతికే జీవుల్లో టార్టిగ్రేడ్‌లు ముందు వరుసలో ఉన్నాయి.
బొద్దింకలు…
మనను చికాకు పెట్టే జీవుల్లో బొద్దింక ఒకటి. ఇవి కూడా అత్యంత విపత్కర పరిస్థితులను తట్టుకుంటాయి. డైనోసార్లతో కలిసి జీవించిన బొద్దింకలు.. భూమిని ఆస్టరాయిడ్ ఢీకొన్నప్పుడు డైనాసార్లు అంతమయ్యాయి. బొద్దింకలు మాత్రం బతికే ఉన్నాయి. మట్టిలో, రాళ్లలో, మరెకకడైనా దూరిపోయి దాక్కోవడం, ఏది దొరికితే దానిని తిని బతికేయడం, చాలా వరక విషపదార్థాలను, రేడియేషన్‌ను కూడా తట్టుకోగలగడం వీటి ప్రత్యేకత. అందుకే తీవ్ర విపత్తులను కూడా బొద్దింకలు తట్టుకుంటాయి.
రాబందులు..
భూమ్మీద ప్రకృతి విపత్తు వచ్చే స్థాయిని బట్టి కొన్ని రకాల జవంతువులకు లాభమూ జరుగుతుంది. అలాంటివాటిలో రాబంధులు ఒకటి. ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనడం వంటివి జరిగితే.. గాల్లో అంతెత్తున, చాలా దూరం ప్రయాణించి తప్పించుకోగలవు. విపత్తుల కారణంగా మరణించే జంతువుల మాంసం తింటూ బతికేయగలవు. కుళ్లిన మాంసంలో పెరిగే బ్యాక్టిరియాను, ఇతర సూక్ష్మజీవులను కూడా డైజెస్ట్ చేయగలవు.
షార్క్‌లు…
భూమిమీద పురాతన జీవుల్లో షార్క్ చేపల జాతి ఒకటి. భూమిమీద చెట్టు ఏర్పడకముందే సముద్రాల్లో షార్క్‌ల జాతి ఉద్భవించి జీవిస్తున్నాయట. తర్వాత జరిగిన ప్రకృతి ఉత్పాతాల్లో డైనోసార్లు సహా ఎన్నో జీవజాతుల అంతరించినా షార్క్‌లు మాత్రం బతికే ఉన్నాయి. సముద్రాల్లో అత్యంత లోతైన ఎలాంటి వెలుగు ప్రసరించని చోట తీవ్ర పీడనాన్ని తట్టుకుని బతకగలగడం షార్క్‌ల ప్రత్యేకత. అందుకే ఇవి కూడా ఎలాంటి విపత్తును అయినా తట్టుకుంటాయి.
పెంగ్విన్లు..
అంటార్కిటికా ఖండంలో ఉండే అత్యంత శీతల పరిస్థితులను, గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకుని జీవిస్తున్న జీవులు పెంగ్విన్‌లు. వాటి శరీరంలో గణనీయంగా కొవ్వు ఉంటుంది. కొన్ని వారాలపాటు ఆహారం లేకున్నా బతకగలవు. ఇక అవి ఉన్న ప్రాంతాల్లో విపత్తులు సంభవించే అవకాశం తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి విపత్తులు వచ్చినా బతికేస్తాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.