RBI to PNB: సాధారణంగా రాజధాని( capital) అంటేనే పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసే కేంద్రం. అన్ని రకాల కార్యాలయాలు ఒక చోటే అందుబాటులోకి వస్తే పాలన మరింత సరళతరంగా అందుతుంది. అయితే అమరావతి రాజధానిలో ఇప్పటివరకు జరుగుతున్న నిర్మాణాలు ఒక ఎత్తు. ఇకనుంచి జరగబోయే నిర్మాణాలు మరో ఎత్తు. ఎందుకంటే ఈనెల 28న ఒకేసారి 25 ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కార్యాలయాల నిర్మాణం మొదలుకానుంది. 12 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం నిర్మాణం ప్రారంభం కానుంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వీటికి శంకుస్థాపన చేయనున్నారు. తద్వారా అమరావతి విషయంలో కేంద్రం కొత్త సంకేతాలు ఇచ్చినట్లు అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ చొరవ..
ఇప్పటివరకు అమరావతిలో( Amravati capital) రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. మరోవైపు కొన్ని విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇవే కాదు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అంశాలు మొదలైతే గాని అమరావతికి కొత్త రూపు రాదు. ఈ విషయాన్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖతో ప్రత్యేకంగా మాట్లాడింది. దాదాపు 44 ఎకరాలను బ్యాంకింగ్ కార్యాలయాలకు కేటాయించింది. సాధారణంగా బ్యాంకు కార్యాలయాలు అంటేనే త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకుంటాయి. మరో రెండు సంవత్సరాల్లో ఈ కార్యాలయాల నిర్మాణం పూర్తి కావడం ఖాయం. 2028 ద్వితీయార్థంలోనే ఈ కార్యాలయాలన్నీ అందుబాటులోకి రానున్నాయి.
వేడుకగా జరిపేందుకు ఏర్పాట్లు..
బ్యాంకు కార్యాలయాల భవన నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపనను వేడుకగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala sitaraman ) సమక్షంలో ఈ శంకుస్థాపనలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అమరావతికి ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇప్పటినుంచి మరో ఎత్తు అన్నట్టు ఉండనుంది. ఈ బ్యాంకులకు సంబంధించిన శంకుస్థాపనలు జరిగిన వెంటనే.. అమరావతి ఆర్థిక రాజధానిగా కూడా మారనుంది. జాతీయ బ్యాంకులకు సంబంధించి ఉన్నతాధికారులు అమరావతికి రాకపోకలు సాగించనున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అమరావతికి ఇది ఉపయోగకరమే..