Greater Amaravati: అమరావతి( Amravati capital ) విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గత అనుభవాల దృష్ట్యా అమరావతికి చట్టబద్ధత కల్పించాలన్నది ప్రధాన డిమాండ్. అయితే ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలో పార్లమెంట్ ముంగిటకు అమరావతి బిల్లు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సైతం కోరినట్లు సమాచారం. తాజాగా సిఆర్డిఏ అధికారులకు అమరావతి రైతులు కోరింది ఇదే. ఒకసారి చట్టబద్ధత కల్పిస్తే అమరావతి రాజధానిని కదిలించలేరన్నది రైతుల వాదన. దానిని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే నెలలో అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ ముంగిటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
నవ నగరాలే టార్గెట్
అమరావతిలో నవ నగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు( CM Chandrababu) ప్రణాళిక. ప్రస్తుతం అమరావతిలో 29 పంచాయితీలే ఉన్నాయి. అయితే ఇటు విజయవాడ, అటు గుంటూరును కలుపుకొని అమరావతిని ఏకైక నగరంగా గుర్తిస్తే.. గ్రేటర్ హైదరాబాద్ గా మారుతుంది అన్నది చంద్రబాబు ఆలోచన. మొన్న ఈ మధ్యన అదే ప్రకటన చేశారు చంద్రబాబు. 29 పంచాయతీలను అమరావతిగా గుర్తించడం అనేది భావ్యం కాదని.. అమరావతి అనేది ఒక సువిశాల నగరంగా ప్రపంచానికి పరిచయం చేయాలన్నది చంద్రబాబు ప్రణాళిక. అయితే ఇప్పుడు చట్టబద్ధత కల్పించే విషయంలో ఎలా ముందడుగు వేయాలి అన్నది బాబు ముందున్న అంశం. అయితే వచ్చే ఏడాది వరకు నగరపాలక సంస్థలతో పాటు మున్సిపాలిటీలకు పదవీకాలం గడువు ఉంది. అయితే అంతకంటే ముందే ఈ నగరాలను, పట్టణాలను, పంచాయితీలను అమరావతి కిందకు తెచ్చేందుకు చంద్రబాబు సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
జిహెచ్ఎంసి తరహాలో..
గ్రేటర్ హైదరాబాద్( Greater Hyderabad) తరహాలో.. గ్రేటర్ అమరావతిని తెస్తే బాగుంటుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. ఎందుకంటే అటు విజయవాడ, ఇటు గుంటూరు మధ్య అమరావతిని అభివృద్ధి చేయాలన్నది చంద్రబాబు ప్రణాళిక. అమరావతికి ఆ రెండు నగరాలు తోడైతే ప్రపంచంలోనే ఏకైక నగరంగా నిలపవచ్చు అన్నది కూడా ఆయన ఆలోచన. అందుకే ఈ మూడు నగరాలను కలిపి ఏకైక నగరంగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తే ఎంతో బాగుంటుందని అధికారులు సైతం కీలక సూచనలు చేశారట. అయితే ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కోరిందట. మొత్తానికి అయితే అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు అవసరమైన అడుగులు పడుతుండడం నిజంగా శుభ పరిణామం.