Rayalaseema four-lane road : ఏపీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ఏపీ పై ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడం, ఏపీలో అధికారం పంచుకోవడంతో.. బిజెపి పాలిత రాష్ట్రాల కంటే ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలకు సహకారం అందించింది కేంద్రం. గత రెండుసార్లకు భిన్నంగా.. ఈసారి కేంద్రం అన్ని విధాల ఏపీకి సహాయపడుతుండడం విశేషం. అమరావతిలో కేంద్ర ప్రభుత్వం చాలా రకాల ప్రాజెక్టులు చేపడుతోంది. రైల్వే, రోడ్డు రవాణా ప్రాజెక్టులను ఇప్పటికే ప్రారంభించింది. జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో కూడా ఏపీకి అత్యంత ప్రాధాన్యం దక్కుతోంది.
* మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం
తాజాగా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీకి మరో కీలక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కడప జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లాలోని గురువింద పూడి వరకు నాలుగు వరుసల రోడ్డుకు పచ్చ జెండా ఊపింది. 3650 3 కోట్ల రూపాయల వ్యయంతో 108 కిలోమీటర్ల పొడవున ఈ రహదారిని నిర్మించినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో ఏపీతోపాటు ఉత్తర కర్ణాటకలోని ఆర్థిక క్యారీడార్కు పోర్టు కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. 23 కిలోమీటర్ల మేర అప్ గ్రేడ్, 85 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం, బిల్డ్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో హైవే నిర్మించాలని నిర్ణయించారు. మొత్తం నాలుగు వరుసల రహదారి నిర్మాణం కానుంది.
Also Read : స్వచ్ఛమైన నీళ్లు.. బండరాళ్లల్లో ఖనిజాలు.. రాయలసీమలో ఈ ప్రాంతం ఎక్కడ ఉందంటే?
* కృష్ణపట్నం రోడ్డుకు అనుసంధానం..
మునుగోలు మండలం గురివింద పూడి సమీపంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డు నుంచి బద్వేలు మండలం గోపవరం వరకు 108.13 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించనున్నారు. కోర్టు రోడ్డు టు బద్వేలు జాతీయ రహదారి ప్రాజెక్టును డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నిర్మించనున్నారు. మనుబోలు, పొదలకూరు, చేజర్ల, అనంతసాగరం, మర్రిపాడు మండలాల మీదుగా ఈ రోడ్డు నిర్మాణం జరుపుకొనుంది. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్ట్, ఇతర పరిశ్రమల నుంచి వాహనాలు రాయలసీమ ప్రాంతానికి వెళ్లాలంటే ముంబై హైవే పై ఆధారపడాల్సి వస్తోంది. అదే ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రవాణా మరింత సులభతరం కానుంది. మొత్తంగా ఈ రోడ్డు ప్రాజెక్టుకు రూ.3653.10 కోట్లు ఖర్చు చేయనున్నారు. వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు కసరత్తు చేస్తున్నారు.