Rajanna(YSR) Jayanti: జాతీయస్థాయిలో తెలుగువాడు అంటే ముందుగా గుర్తొచ్చేది దివంగత మహానేత నందమూరి తారకరామారావు( Nandamuri Taraka Rama Rao ). తరువాత అంతటి ఖ్యాతిని సంపాదించింది డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhar Reddy ). యెడుగురి సందింటి రాజశేఖర్ రెడ్డి ఇంతింతై వటుడింతై అన్న చందంగా రాష్ట్ర రాజకీయాల గతి మార్చిన నాయకుడు అయ్యారు. పేద ప్రజల ఆశాజ్యోతి అయ్యారు. పేదవాడికి పట్టెడన్నం, చదువు, విద్య, వైద్యం అందించాలన్న తపనతో పని చేశారు. ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల మూడు నెలల పాటు పదవిలో ఉన్నా.. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్నారు. తెలుగు నాట చెరగని ముద్ర వేసుకున్నారు. 1949 జూలై 8న పులివెందులలో జన్మించారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
Also Read: నాన్న.. మళ్లీ రావా.. జగన్ ఏమోషనల్ వీడియో
పేదల డాక్టర్ గా..
వైయస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి( Raja Reddy) సాధారణ రాజకీయ పార్టీ నాయకుడు. కుమారుడు వైయస్ రాజశేఖర్ రెడ్డిని పేదల డాక్టర్ గా చూడాలనుకుని వైద్యం చదివించారు. అలా వైద్య వృత్తిలో అడుగుపెట్టిన రాజశేఖర్ రెడ్డి పేదల వైద్యుడిగా.. ఆ ప్రాంతానికి ఆశాదీపంగా మారిపోయారు. అనతి కాలంలోనే గుర్తింపు సాధించారు. 1978లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీలో అడుగు పెట్టారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజకీయాలను అవపోషణ పట్టుకున్న ఏకైక నాయకుడు రాజశేఖర్ రెడ్డి. నాలుగు సార్లు ఎంపీగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా, పిసిసి అధ్యక్షుడిగా, శాసనసభలో విపక్ష నేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవులు చేపట్టి.. వాటికే వన్నెతెచ్చిన వన్ అండ్ ఓన్లీ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయం..
2003లో నడి వేసవిలో దాదాపు 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారు. అప్పటికే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ( Congress Party)నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. తెలుగు నాట అధికారానికి దూరమై సత్తమత్తమవుతోంది. ఆ సమయంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి కీలక హామీలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎవరైనా ఆ హామీలు అమలు తీర్చేలా తాను బాధ్యత తీసుకుంటానని ప్రజలకు చెప్పుకొచ్చారు. ప్రజలు రాజశేఖర్ రెడ్డిని బలంగా నమ్మారు. అద్భుత విజయాన్ని అందించారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మెజారిటీని ఇచ్చింది ఏపీ. అయితే కాంగ్రెస్ రాజకీయాలను తట్టుకొని.. ఎంతమందో హేమా హేమీలను అధిగమించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేశారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. 108 వాహనాలను ఏర్పాటు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకంతో పేదల ఇంట చదువుల వెలుగులు నింపారు. జలయజ్ఞంతో వ్యవసాయాన్ని బంగారంలా మార్చారు. రైతు పక్షపాతిగా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తెలుగు నాట తిరుగులేని నేతగా రాజశేఖర్ రెడ్డిని మార్చాయి.
Also Read: ఆ వైసీపీ నేత ఫుల్ సైలెన్స్.. తేల్చుకోలేకపోతున్న జగన్!
మహా యుద్ధంలో విజేతగా..
2009 ఎన్నికల్లో ఓవైపు చిరంజీవి( megastar Chiranjeevi) నేతృత్వంలోని ప్రజారాజ్యం. ఇంకోవైపు చంద్రబాబు, కెసిఆర్ నేతృత్వంలోని మహాకూటమి.. ఇలా వైరిపక్షాలు మోహరించాయి. చిరంజీవి,పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ప్రజారాజ్యం పార్టీకి ఉండగా.. వామపక్షాలతో పాటు ఇతరుల బలంతో మహాకూటమి దృఢంగా కనిపించింది. ఆ సమయంలో దూకుడు కలిగిన వైయస్ రాజశేఖర్ రెడ్డి గట్టిగానే ప్రజల్లోకి వెళ్లారు. తాను చేసింది చెప్పారు. చేయవలసింది ఎంతో ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఆ మహా యుద్ధంలో రాజశేఖర్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అక్కడకు మూడు నెలలకే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. తెలుగు ప్రజలు విషాదంలో మునిగిపోయారు. తదనంతరం తెలుగు రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతూ రాష్ట్ర విభజనకు కారణమయ్యాయి. అయితే సామాన్యుడు నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు.. రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడతారు. అంతలా తెలుగు నాట ప్రభావితం చేసిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి. అటువంటి నేతకు అంజలి ఘటిద్దాం.