Kondru Murali Mohan: మాజీ మంత్రి, మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి చంద్రబాబు షాక్ ఇచ్చారు. ఆమె కుమార్తెకు టిక్కెట్ లేదని తేల్చేశారు. రాజాం నియోజకవర్గ టికెట్ ను మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ కు ఖరారు చేశారు. దీంతో సీనియర్ నాయకురాలికి చుక్కెదురు అయ్యింది. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని.. కుమార్తె గ్రీష్మ కు ఛాన్స్ ఇవ్వాలని గత కొద్ది రోజులుగా ప్రతిభా భారతి కోరుతూ వచ్చారు. పార్టీలో తన సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. అయితే మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కోండ్రు మురళీమోహన్ అయితే నెగ్గుకు రాగలరని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
2014, 2019 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గాన్ని వైసీపీ గెలుచుకుంది. ఎమ్మెల్యేగా కంబాల జోగులు గెలుపొందారు. అయితే ఆయనపై వ్యతిరేకత ఉంది. దీంతో హై కమాండ్ ఆయనను పాయకరావుపేట నియోజకవర్గానికి షిఫ్ట్ చేసింది. స్థానికంగా ఉండే ఒక కొత్త అభ్యర్థిని బరిలో దించనుంది. దీంతో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది. అన్ని రకాల సర్వేలు చేపట్టింది. కొండ్రు మురళీమోహన్ అయితే గెలుపు ఈజీ అవుతుందని సర్వే లెక్కలు కట్టాయి. దీంతో ఆయన వైపు చంద్రబాబు మొగ్గు చూపారని సమాచారం.
కోండ్రు మురళీమోహన్ 2009లో రాజాం నియోజకవర్గంలో నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. కిరణ్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో రాజాం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారు. ముఖ్యంగా రాజాం పట్టణ అభివృద్ధికి కోండ్రు మురళీమోహన్ హయాంలో అడుగులు పడ్డాయి. గత రెండు ఎన్నికల్లో ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో వైసీపీని రాజాం నియోజకవర్గం ప్రజలు ఆదరించారు. కానీ ఎటువంటి అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. అటు కోండ్రుపై కూడా నమ్మకం పెరుగుతోంది. టిడిపిలో భారీ చేరికలు పెరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో కోండ్రు మురళీమోహన్ వైపు చంద్రబాబుతో పాటు లోకేష్ మొగ్గు చూపారు. పండుగ అనంతరం ఏ వివాదాలు లేని నియోజకవర్గాలను ప్రకటించాలని టిడిపి భావిస్తోంది. ఆ జాబితాలో కోండ్రు మురళీమోహన్ పేరు ఉన్నట్టు సమాచారం.
ప్రతిభా భారతి కుమార్తెకు పార్టీ అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని అధినేత హామీ ఇచ్చినట్లు సమాచారం. అటు కళా వెంకట్రావు సొంత ప్రాంతం కావడం, ప్రతిభా భారతి స్థానికురాలు కావడంతో మధ్యలో కొద్దిపాటి సమీకరణలు మారాయి. కానీ కోండ్రు మురళీమోహన్ పార్టీ శ్రేణులను సమన్వయం చేయడంలో సక్సెస్ అయ్యారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకొచ్చారు. పార్టీ సర్వేల్లో కూడా ఇదే తేలింది. కోండ్రు మురళీమోహన్ కు మార్గం సుగమం చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కాగా.. అందులో రాజాం నుంచి కోండ్రు మురళీమోహన్ కు కన్ఫర్మ్ కావడం విశేషం.