Jagan: ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. పట్టుమని మూడు నెలల వ్యవధి కూడా లేదు. దీంతో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2 తో ముగియనుంది. దీంతో వారి స్థానంలో కొత్త వారి కోసం ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది. ఈ మూడు స్థానాలు వైసిపి దక్కించుకునే అవకాశం ఉంది. దీంతో సీఎం జగన్ ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేశారు.
వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టిడిపి నుంచి కనకమెడల రవీంద్ర కుమార్, బిజెపి నుంచి సీఎం రమేష్ సిట్టింగ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఈ ముగ్గురు పదవీ విరమణ చేయనున్నారు. వీరి స్థానంలో మరో ముగ్గురు ఎంపీలను ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సి ఉంటుంది. సంఖ్యా బలంగా ఈ మూడు స్థానాలు వైసిపి గెలుచుకోవడం ఖాయం. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఇన్చార్జిల మార్పు నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని ప్రచారం జరుగుతోంది. అందుకే సీఎం జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బలమైన సామాజిక నేపథ్యంలో ఉన్న నేతలను బరిలో దించుతున్నారు.
వైసిపి రాజ్యసభ సభ్యుల ఎంపిక దాదాపు పూర్తయినట్లు సమాచారం. సామాజిక సమతుల్యతను పాటిస్తూ అభ్యర్థులను జగన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ సీనియర్ నేతలు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, జంగాలపల్లి శ్రీనివాసులను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో వై వి సుబ్బారెడ్డి ఓసీ కాగా, గొల్ల బాబురావు ఎస్సీ, జంగాలపల్లి శ్రీనివాసులు బలిజ సామాజిక వర్గానికి చెందినవారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తూ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై వైసీపీ హై కమాండ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది.