AP Weather: ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ప్రధానంగా దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఉత్తరాంధ్రలో సైతం వర్షపాతం నమోదు అయ్యింది. నెల్లూరు, శ్రీ సత్య సాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య, రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి.అయితే ప్రధానంగా తమిళనాడు పై తుఫాను ప్రభావం అధికంగా కనిపించింది. మంగళవారం కూడా వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు విపత్తు నిర్వహణ సంస్థ ప్రత్యేక ప్రకటన జారీ చేసింది.
* ఆ రెండు జిల్లాలకు నష్టం
అయితే ఈ తుఫాను ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాలకు ఎక్కువగా నష్టం జరిగింది. అత్యధికంగా కేఎం అగ్రహారంలో 187 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆర్కే పురం 162, రాచపాలెం 152, మన్నార్ పోలూరు లో 149, భీముల వారి పాలెం లో 137 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు వాతావరణ శాఖ చెబుతోంది.
* తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పొగ మంచు ప్రభావం కనిపిస్తోంది. దీంతో ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. విశాఖ ఏజెన్సీలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడం విశేషం. చలి పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులు, కాళ్లు శరీరంతో పాటు చెవులను కూడా కప్పి ఉంచేలా వేసుకోవాలని చెబుతున్నారు. చలి తీవ్రత పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు రావడం కూడా మొదలవుతుందని చెబుతున్నారు. రాత్రిపూట అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు. మరో రెండు నెలల పాటు చలి తీవ్రత ఉంటుందని.. అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ఒకవైపు వర్షం, మరోవైపు చలితో ఏపీ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.