Raghu Rama Krishna Raju
Raghu Rama Krishna Raju: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు అనుకున్నది సాధించారు. ఎన్నికల్లో నిలుస్తానని చెప్పిన ఆయన.. అన్నట్టుగానే టిడిపి టికెట్ సాధించారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. నరసాపురం ఎంపీ టికెట్ రాకుండా జగన్ అడ్డుపడ్డారని.. బిజెపిలోని ప్రోవైసిపీ నేతలతో తనకు టికెట్ రాకుండా చేశారని రఘురామ ఆరోపించారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరడమే కాదు.. స్వల్ప కాలంలో ఆ పార్టీ టికెట్ పొందగలిగారు. నేరుగా ఇప్పుడు వైసిపి తో తలపడనున్నారు.
గత ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు రఘురామకృష్ణంరాజు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే రెబల్ గా మారారు.గత ఐదు సంవత్సరాలుగా వైసీపీని ఇరకాటంలో పెడుతూ వచ్చారు. కేంద్రంలోని బిజెపికి మద్దతు ఇచ్చేవారు. టిడిపి, జనసేనతో సన్నిహితంగా మెలిగేవారు. జగన్ వ్యతిరేక మీడియాకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవారు. అటు వైసిపి రఘురామకృష్ణంరాజు పై చర్యలకు ప్రయత్నించినా వీలు కాలేదు. కేంద్రం వద్ద రఘురామకు పరపతి ఉండడంతో వైసిపి ఏం చేయలేకపోయింది. ఈ ధీమాతోనే బిజెపి నుంచి తనకు టికెట్ ఖాయమని రఘురామ భావించారు. చివరి వరకు వేచి చూశారు. కానీ బిజెపి హ్యాండిచ్చింది. భూపతి రాజు శ్రీనివాస వర్మకు నరసాపురం ఎంపీ టికెట్ కేటాయించింది. అప్పటినుంచి రఘురామ టెన్షన్ తో గడపాల్సి వచ్చింది. సోము వీర్రాజు ద్వారా బిజెపి టిక్కెట్ రాకుండా జగనే చేశారని రఘురామ ఆరోపించారు. అయినా సరే తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని రఘురామ ప్రతిన బూనారు.
అయితే రఘురామ పరిస్థితిని చూసిన చంద్రబాబు ఆయన కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నరసాపురం ఎంపీ స్థానాన్ని బిజెపి వదులుకుంటే ఏలూరు ఇస్తామని ఆఫర్ చేశారు. బిజెపి అగ్రనాయకత్వం అనుమతి కోసం ఎదురు చూశారు. కానీ హై కమాండ్ అందుకు ఒప్పుకోలేదు. అటు ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కు బి ఫారం కూడా అందించింది. ఈ తరుణంలోనే చంద్రబాబు సీరియస్ గా ఆలోచించడం ప్రారంభించారు. నరసాపురం లోక్సభ స్థానం పరిధిలోని ఉండి అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని చూశారు. అయితే అక్కడ టిడిపికి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. గతంలో ఆయన పేరును కూడా ప్రకటించారు.దీంతో ఆయనను మార్చి రఘురామరాజుకు ఆ సీట్ కేటాయించారు. అందుకుగాను మంతెన రామరాజుకు ఒప్పించే బాధ్యతను టిడిపి నేతలకు అప్పగించారు చంద్రబాబు.
అయితే ఇదంతా ఫ్రీ ప్లాన్ అని వైసిపి ఆరోపిస్తోంది. రఘురామకృష్ణంరాజుకు ఏనాడో టికెట్ కేటాయింపు జరిగిందని.. కానీ ఒక రకమైన హైప్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇలా ప్లాన్ చేశారని వైసిపి చెబుతోంది. కొద్దిరోజుల కింద స్పీకర్ కావాలని ఉందని రఘురామకృష్ణంరాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందరికీ అర్థమైంది. అయితే ఇప్పుడు ఉండి టిడిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టిడిపి జిల్లా పగ్గాలతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే రఘు రామ అనుకున్నది సాధించారు.