Pushpa 2: ఏపీలో పుష్ప 2 సినిమా రచ్చ చేస్తోంది. సినిమా ప్రదర్శితం అవుతున్న థియేటర్ల వద్ద సందడి నెలకొంది. అదే సమయంలో రాజకీయ దుమారం నడుస్తోంది. ఈ సినిమా ధియేటర్ల వద్ద ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు వివాదాస్పదం అవుతున్నాయి. అల్లు అర్జున్ కు మద్దతుగా జగన్ ఫోటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. తమకు మద్దతు ప్రకటించిన అల్లు అర్జున్ కు.. ఇప్పుడు తాము మద్దతు తెలుపుతామని ముందుకు వస్తున్నారు వైసీపీ శ్రేణులు. పుష్ప సినిమా సౌండ్ ఇప్పుడు యావత్ భారతదేశం వ్యాప్తంగా వినిపిస్తోంది. ఏ థియేటర్లలో చూసినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే పతాక స్థాయికి చేరుకుంది. ఈ తరుణంలో ఫ్లెక్సీల వివాదం కొట్లాటకు దారితీసింది.
* కొట్లాటకు దారి తీసిన వివాదం
తిరుపతి జిల్లా పాకాల లోని శ్రీ రామకృష్ణ థియేటర్ వద్ద సినిమాకు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. అల్లు అర్జున్ తో పాటుగా మాజీ సీఎం జగన్, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మంచి చేసి మోసపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ ఫ్లెక్సీలో రాసి పెట్టారు. దీనిపై టిడిపి నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వివాదాన్ని సద్దుమణిగించారు.
* ఓ రేంజ్ లో
ఒక్కసారిగా పుష్ప2 చిత్రం రాజకీయ రచ్చకు కారణం అవుతోంది.ఏపీలో పరిస్థితి తీవ్రంగా ఉంది. మెగా కుటుంబంతో అల్లు ఫ్యామిలీ విభేదించిందన్న వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే అల్లు అర్జున్ ను వైసీపీ నేతలు ఓన్ చేసుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక రకమైన వాతావరణం క్రియేట్ అవుతోంది. ఫ్లెక్సీల ఏర్పాటుతో వైసీపీ శ్రేణులు హడావిడి చేస్తున్నాయి. దీనిని టిడిపి తో పాటు జనసేన అడ్డుకోవడంతో వివాదాలకు కారణమవుతోంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్ అన్నట్టు ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ ఆ స్థాయిలో కొనసాగుతోంది.