AP Rains: ఏపీకి మరో ప్రమాదం పొంచి ఉంది. భారీ వర్ష సూచన వచ్చింది. మరోసారి తుఫాను హెచ్చరిక వాతావరణ శాఖ నుంచి రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వరి కోతల ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో తుఫాన్ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. నిన్నటి వరకు ఫెంగల్ తుఫాను ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపించింది. ఈరోజు ఎండ వాతావరణం వచ్చింది. ఇంతలోనే రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఉపరితల ఆవర్తనంగా ఏర్పడనుందని.. తుఫానుగా మారి దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. పెను ప్రభావం తప్పదు అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తుండడంతో ఒక రకమైన భయాందోళన నెలకొంది.
* రెండు రోజుల్లో స్పష్టత
అయితే ఈ తుఫాన్ కు సంబంధించి శుక్రవారం ఒక స్పష్టత వస్తుంది. ఫెంగల్ తుఫాను ఇప్పటికే బలహీనపడి అల్పపీడనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. గురు, శుక్రవారాల్లో దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు పడనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. శుక్రవారం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం శ్రీలంక దిశగా పయనిస్తుందని అంచనా వేస్తోంది.
* పెరిగిన చలి
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. మున్ముందు చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఉదయం 8 గంటల వరకు కొనసాగనుంది. మరోవైపు చలితో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అటు వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.