https://oktelugu.com/

Purandeshwari vs GVL : పురందేశ్వరి vs జీవీఎల్.. బీజేపీలో విశాఖ సీటు ఫైట్

పురంధేశ్వరి పోటీచేయడం ఖాయం. అయితే తమ నేత ఎప్పటి నుంచో ప్రయత్నాల్లో ఉన్నారని..ఢిల్లీ పెద్దల ఆశీస్సులున్నట్టు జీవీఎల్ అనుచరులు చెబుతున్నారు. అయితే ఎన్నికల వేళ విశాఖ లోక్ సభ స్థానం బీజేపీలో హీట్ పుట్టించే అవకాశముంది.

Written By: , Updated On : July 6, 2023 / 10:27 AM IST
Follow us on

Purandeshwari vs GVL : ఏపీ బీజేపీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాయకత్వాల మార్పుతో సమీకరణలు మారుతున్నాయి. సోము వీర్రాజు స్థానంలో అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని పార్టీ హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. కేంద్ర మాజీ మంత్రిగా, రాజకీయాల్లో అనుభవశాలిగా ఉన్న ఆమె సేవలను వినియోగించుకోవాలని హైకమాండ్ చూస్తున్నట్టు  నియామకం తెలియజేస్తోంది. అయితే ఆమె నియామకంతో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇతర రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడయ్యారు. అందుకే అక్కడే ఇళ్లు కొనుగోలు చేసి కార్యకలాపాలను ప్రారంభించారు.

మరోవైపు విశాఖపై పురంధేశ్వరి సైతం ఎప్పటి నుంచో ఫోకస్ పెంచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014లో పొత్తులో భాగంగా విశాఖ నుంచి బరిలో దిగాలని చూసినా హరిబాబు ఉండడంతో సాధ్యం కాలేదు. రాజంపేట నుంచి పోటీకి దిగినా నెగ్గలేదు. 2019లో విశాఖ నుంచి బీజేపీ తరుపున పోటీచేసినా పొత్తులు లేకపోవడంతో డిపాజిట్లు కూడా దక్కలేదు. 2024లో పోటీకి దిగాలని భావిస్తున్న తరుణంలో జీవీఎల్ రూపంలో  పోటీ ఎదురైంది.

వాస్తవానికి జీవీఎల్ నరసింహరావు విశాఖ పై ఫోకస్ పెంచి చాన్నళ్లయ్యింది. తరచూ విశాఖ రావడం చేస్తున్నారు. తన సామాజికవర్గాన్ని అలెర్ట్ చేస్తున్నారు. వారి ఓట్లను గణాంకాలతో లెక్కించి మరీ రాజకీయం చేస్తున్నారు. కొన్నేళ్ల కిందట సాగర నగరంలో ఏకంగా ఇంటిని కొనుగోలు చేశారు. విశాఖ, ఉత్తరాంధ్ర సమస్యలను ప్రస్తావిస్తుండే వారు. అయితే ఒంటరిగా వెళితే ఇక్కడ బీజేపీ గట్టెక్కే అవకాశం లేదు. పొత్తుతో అయితే మాత్రం నెగ్గుకురాగలరు. అందుకే టీడీపీ, జనసేనల విషయంలో గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విమర్శల దాడి తగ్గించారు.

ఇక్కడ నుంచి పోటీచేయాలని పురంధేశ్వరి భావిస్తున్నా.. తనకున్న ఢిల్లీ పరిచయాలతో టిక్కెట్ సాధిస్తానన్న ధీమా జీవీఎల్ లో ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా పురంధేశ్వరి రాష్ట్ర బీజేపీకి చీఫ్ కావడంతో ఆమెకు లైన్ క్లీయర్ అవుతుందన్న ఆందోళన జీవీఎల్ లో కనిపిస్తోంది. పొత్తులు ఉన్నా.. లేకపోయినా.. పురంధేశ్వరి పోటీచేయడం ఖాయం. అయితే తమ నేత ఎప్పటి నుంచో ప్రయత్నాల్లో ఉన్నారని..ఢిల్లీ పెద్దల ఆశీస్సులున్నట్టు జీవీఎల్ అనుచరులు చెబుతున్నారు. అయితే ఎన్నికల వేళ విశాఖ లోక్ సభ స్థానం బీజేపీలో హీట్ పుట్టించే అవకాశముంది.