Bhimavaram: ‘పేరుకే జనసేన కానీ.. ఆ పార్టీ నుంచి పోటీ చేసేది టిడిపి అభ్యర్థులే. జనసేన ను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు. చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగానే జనసేన పని చేస్తోంది’.. వైసిపి తరచూ చేసే ఆరోపణలు ఇవి. దీనిని నిజం చేసేలా పరిణామాలు జరగడం విశేషం.జనసేన పొత్తులో భాగంగా కేవలం 24 అసెంబ్లీ స్థానాలకు, మూడు పార్లమెంట్ స్థానాలకు అంగీకరించడం జనసేన పార్టీ శ్రేణులకు ఏమాత్రం మింగుడు పడడం లేదు. కనీసం 40 స్థానాలకు పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతా భావించారు. కానీ కేవలం 24 తో సరిపెట్టడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ 24 స్థానాల్లో సైతం ఎప్పటినుంచో పార్టీ జండా మోస్తున్న నాయకులకు కాకుండా.. వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి కట్టబెట్టడం విమర్శలకు కారణమవుతోంది.
తాజాగా భీమవరం నియోజకవర్గ జనసేన టికెట్ ను పులపర్తి రామాంజనేయులకు ఖరారు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈయన టిడిపి నాయకుడు. గత ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. ఇప్పుడు అదే నాయకుడిని జనసేన అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తుండడం విమర్శలకు కారణమవుతోంది. గురువారం సాయంత్రం భీమవరం జనసేన పార్టీ శ్రేణులతో సమావేశమైన పవన్ ఈ విషయంలో స్పష్టత ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగుదేశం పార్టీలో చేరాల్సిన చాలామంది నేతలు జనసేనలోకి వెళ్తున్నారు.వారందరికీ టిక్కెట్లు ఖరారు అవుతున్నాయి. కొణతాల రామకృష్ణ, కొత్తపల్లి సుబ్బారాయుడు, వల్లభనేని బాలశౌరి, సానా సతీష్ లాంటి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరతారని అంతా భావించారు. కానీ వారు అనూహ్యంగా జనసేనలో చేరారు. జనసేన టికెట్లు దక్కించుకున్నారు. ఇప్పటికే కొణతాల రామకృష్ణకు అనకాపల్లి అసెంబ్లీ సీటు ఖరారు అయింది. కొత్తపల్లి సుబ్బారాయుడు కు నరసాపురం టికెట్ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. అటు వల్లభనేని బాలశౌరికి మచిలీపట్నం ఎంపీ స్థానం కేటాయించినట్లు టాక్ నడుస్తోంది. తాజాగా పులపర్తి రామాంజనేయులకు భీమవరం టికెట్ ఖరారు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. అయితే ఇలా బయట పార్టీల నుంచి వస్తున్న నేతలకు టికెట్లు కట్టబెట్టడం వెనుక చంద్రబాబు ఉన్నారన్న విమర్శ ఉంది. ఈ విషయంలో పవన్ చర్యలను సొంత పార్టీ శ్రేణులే తప్పుపడుతున్నారు. టిడిపి నేతలను పార్టీలో చేర్చుకునే టిక్కెట్లు ఇస్తే అది పొత్తు ధర్మం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేస్తే ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదని అనుమానిస్తున్నారు. మరి దీనిని పవన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.