https://oktelugu.com/

Pratthipaati Pullarao : ఆ మూడు కారణాలతో పార్టీకి దూరంగా ప్రత్తిపాటి పుల్లారావు!

టిడిపిలోని సీనియర్ నేతల్లో ప్రత్తిపాటి పుల్లారావు ఒకరు. ఈ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గెలిచిన ఆయన మంత్రి పదవి ఆశించారు. కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యత దక్కాలని భావించారు. అవేవీ దక్కకపోయేసరికి నిరాశకు గురైనట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యకలాపాలను తగ్గించినట్లు కూడా టాక్ నడుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : October 7, 2024 / 01:01 PM IST

    Pratthipaati Pullarao

    Follow us on

    Pratthipaati Pullarao : ఏపీలో కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి హై కమాండ్ కు తలనొప్పిగా మారుతోంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పుడే చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగించారని.. వైసిపి ప్రజాప్రతినిధుల చర్యలకు విసిగి వేశారి మిమ్మల్ని గెలిపించారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అయితే ఇలా కొద్దిరోజులకే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. దీంతో పార్టీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. మరొకరు వివాదాస్పద ప్రవర్తనతో పార్టీ క్రమశిక్షణ సంఘం ఎదుట హాజరయ్యారు. తన పనితీరును మార్చుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రతిపాటి పుల్లారావు ఇప్పుడు పార్టీలో యాక్టివ్ గా లేకపోవడం కొత్త చర్చకు దారితీస్తోంది. గత నెలలో ఆయన భార్య వెంకాయమ్మ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వివాదాస్పదంగా మారాయి. ఏకంగా పోలీస్ సిబ్బంది జన్మదిన కేకు కట్ చేయడంలో పాల్గొన్నారు. దీంతో ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. స్వయంగా చంద్రబాబు ఎదుట హాజరైన ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది యాదృచ్ఛికంగా జరిగిన ఘటనగా చెప్పుకొచ్చారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కానీ అటు తరువాత పార్టీ కార్యక్రమాల్లో ప్రతి పార్టీ పుల్లారావు యాక్టివ్ తగ్గించారు. దీంతో రకరకాల చర్చ ప్రారంభం అయ్యింది. ఆయన అలకబూనారా? అసంతృప్తికి గురయ్యారా? అన్నది తెలియాల్సి ఉంది.

    * 2019లో ఓటమి
    ప్రత్తిపాటి పుల్లారావు పార్టీలో సీనియర్. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.దీంతో చంద్రబాబు క్యాబినెట్లో పుల్లారావు కు చోటు దక్కింది. ఆ ఐదేళ్లపాటు పార్టీతో పాటు ప్రభుత్వంలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆయన. కానీ 2019 ఎన్నికల్లో అదే చిలకలూరిపేట నుంచి పోటీ చేసి.. విడదల రజిని చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో పార్టీని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇటువంటి సమయంలో చంద్రబాబు పిలిచి బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల్లో టికెట్ కూడా ఇచ్చారు. గెలిచిన పుల్లారావు మంత్రి పదవి ఆశించారు. కానీ దక్కలేదు.

    * భార్యకు పదవి కోసం
    పుల్లారావు భార్య వెంకాయమ్మ రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో భార్యకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని ఆయన కోరుతూ వచ్చారు. రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవి ఇవ్వాలని కోరారు. అందుకు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే మూడు పార్టీల కూటమి నేతలకు సర్దుబాటు చేయాల్సి రావడంతో.. చంద్రబాబు వెంకాయమ్మ పేరును పరిగణలోకి తీసుకోలేదు. ఆమెకు ఎటువంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. ఆయనలో అసంతృప్తికి అదొక కారణమని తెలుస్తోంది.

    *కుమారుడిపై జిఎస్టి కేసులు
    ఇంకోవైపు వైసీపీ హయాంలో పుల్లారావు కుమారుడు పై జిఎస్టి కేసు నమోదయింది. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కుమారుడిపై జిఎస్టి కేసు రద్దు అవుతుందని పుల్లారావు భావించారు. ఈ విషయంలో చంద్రబాబు సాయాన్ని కూడా అడిగారు. అయితే జిఎస్టి అనేది కేంద్ర పరిధి కావడంతో కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందుకే కేసు రద్దు విషయంలో జాప్యం జరుగుతోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడం, భార్యకు నామినేటెడ్ పదవి ఇవ్వకపోవడం, కుమారుడిపై కేసులు రద్దు కాకపోవడంతో పుల్లారావు మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. మరి హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.