Prashant Kishor
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలతో పాటు జగన్ వైఖరిపై మాట్లాడారు. తన అంచనాలను మరోసారి వెల్లడించారు. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని హెచ్చరించారు. ఏడాదిన్నర కిందటే జగన్ కు ఈ విషయాన్ని స్పష్టం చేశానని కూడా చెప్పుకొచ్చారు. గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో రకాల తప్పులు జరిగాయని.. దానికి ఎన్నికల్లో మూల్యం తప్పదని కూడా స్పష్టం చేశారు. ఆర్ టివి కోసం రవి ప్రకాష్ ప్రశాంత్ కిషోర్ ను ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గత ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి రాజకీయ వ్యూహ కర్తగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఏకంగా పార్టీ సమావేశంలోనే శ్రేణులకు జగన్ ప్రశాంత్ కిషోర్ ను పరిచయం చేశారు. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే ఐపాక్ టీం నేరుగా రంగంలోకి దిగింది. జగన్ పాదయాత్ర సమయంలో అన్ని రకాల సేవలు అందించింది. ప్రాంతం, కులం, మత ప్రాతిపదికన ఏపీ ప్రజలను విడగొట్టి వైసిపి వైపు టర్న్ చేయడంలో పీకే సక్సెస్ అయ్యారు. పోలింగ్ ముగిసిన తర్వాత నేరుగా జగన్కు శుభాకాంక్షలు చెప్పి అధికారంలోకి రాబోతున్నారని పీకే నాడు తేల్చారు. ఇప్పుడు అదే పీకే పోలింగ్ ముందే జగన్ ఓడిపోబోతున్నారని తేల్చి చెప్పడం విశేషం.
అధికారంలోకి రాక మునుపు తన సలహాలు పాటించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతంత్ర నిర్ణయాలు తీసుకున్నారని.. అందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. వాలంటీర్ వ్యవస్థ మూలంగానే పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేసుకున్నారని.. దాని పర్యవసానాలు ఈ ఎన్నికల్లో చూడబోతున్నారని కూడా పీకే స్పష్టం చేశారు. చివరిగా ఏడాదిన్నర కిందట ఢిల్లీలో జగన్ ను కలిసానని… ఎన్నికల్లో ఓడిపోతున్నారని చెబితే జగన్ తనతో వాదనకు దిగారని.. అదే చివరిసారి కలవడం అని వెల్లడించారు. జగన్ పాలనలో ఎన్నో రకాల లాజికల్ మిస్టేక్స్ జరిగాయని.. దానికి భారీగా నష్టం జరగనుందని కూడా పీకే తేల్చి చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తులను నమ్ముకుంటే 151 సీట్ల నుంచి.. 51 సీట్లకు దిగజారుస్తారని.. ఫలితంగా కూటమికి 126 సీట్లు వస్తాయని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పడం విశేషం.
మరోవైపు బొత్స సత్యనారాయణ విషయంలో పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనతెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఒప్పందం చేసుకున్నారని.. గెలిచిన పార్టీలో ఉండాలని ఆయన కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.జగన్ ప్రకటించిన మూడు రాజధానులు అంశం కూడా తనది కాదని.. అందులో తన పాత్ర అంటూ ఏమీ లేదనిపీకే తేల్చి చెప్పారు. మొత్తానికైతే పోలింగ్ కు ముందు సంచలన వ్యాఖ్యలతో ప్రశాంత్ కిషోర్ జగన్ ను బాగానే డ్యామేజ్ చేశారు.