https://oktelugu.com/

JC  Prabhakar Reddy : జగన్ పై విజయమ్మకు జెసి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు.. అసలేం జరిగింది?

 రాయలసీమలో రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. పగ ప్రతీకారంతో పాటు ఫ్యాక్షన్ రాజకీయాలు కనిపిస్తాయి. ప్రత్యర్థులతో మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు. అటువంటిది జగన్ తల్లి విజయమ్మతో జెసి ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : July 29, 2024 / 03:16 PM IST
    Follow us on

    JC  Prabhakar Reddy : జగన్ సొంత వారిని దూరం చేసుకున్నారు. సొంత సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు. దాని ఫలితమే ఈ భారీ ఓటమి. వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆయన వారసుడికి రాజకీయ వారసత్వం ఇవ్వాలని బలంగా కోరుకుంది రెడ్డి సామాజిక వర్గం. వైయస్సార్ కుటుంబం సైతం అండగా నిలిచింది. యావత్ రాయలసీమే జగన్ కు జై కొట్టింది. కానీ జగన్ ఆ కుటుంబాన్ని పట్టించుకోలేదు. తనకు అండగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అంతకుమించి రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపలేదు. అందుకే అంతటి ప్రజాగ్రహం వ్యక్తం అయింది. చివరకు కుటుంబ సభ్యులు సైతం దూరమయ్యారు. అయితే వీరంతా ఒక ఎత్తు. జగన్ చేతిలో బాధితులుగా మిగిలిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ రాజశేఖర్ రెడ్డి సన్నిహిత కుటుంబాలే. అందులో ఒకటి జెసి కుటుంబం. వైసీపీ అధికారంలోకి రాగానే జెసి ట్రావెల్స్ నిలిచిపోయాయి. జెసి కుటుంబానికి చెందిన వ్యాపార కార్యకలాపాలు ముగిసిపోయాయి. రాజకీయంగా వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. జైలు జీవితం సైతం అనుభవించాల్సి వచ్చింది. అయితే అదే జెసి కుటుంబానికి చెందిన ప్రభాకర్ రెడ్డి.. తాజాగా వైయస్ విజయమ్మను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన బాధను, ఆవేదనను విజయమ్మ వద్ద వ్యక్తపరిచేసరికి ఆమె సముదాయించినట్లు సమాచారం. అసలు ప్రభాకర్ రెడ్డి విజయమ్మను ఎందుకు కలిసినట్టు? ఏం చర్చించినట్టు? ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చ. రాయలసీమలో హాట్ టాపిక్ గా మారింది.
     * ఆ రెండు కుటుంబాల మధ్య సన్నిహిత్యం
     వైయస్ రాజశేఖర్ రెడ్డి తో జెసి కుటుంబానికి మంచి సంబంధాలు నడిచేవి. 2004లో సీఎం గా బాధ్యతలు స్వీకరించారు రాజశేఖర్ రెడ్డి. ఆ సమయంలో మంత్రివర్గంలోకి జెసి దివాకర్ రెడ్డిని తీసుకున్నారు. కీలకమైన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. వారి మధ్య మంచి సంబంధాలే కొనసాగేవి. కానీ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొద్దిపాటి గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరిగింది. అటు తర్వాత రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో దివాకర్ రెడ్డి కొనసాగారు. కానీ ఎందుకో వైయస్ జగన్ వెంట నడవలేదు. వైసీపీలోకి వస్తానని దివాకర్ రెడ్డి ముందుకు వచ్చినా జగన్ అప్పట్లో ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అప్పుడే దివాకర్ రెడ్డి టిడిపికి దగ్గరయ్యారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పటినుంచి జగన్ దివాకర్ రెడ్డిని ప్రత్యర్థిగా చూడడం మొదలుపెట్టారు.
    * వైసిపి పాలనలో ఇబ్బందులే 
     గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలా ఇబ్బందులు పడింది జేసీ కుటుంబం. దివాకర్ రెడ్డి పై సవాల్ చేసిన గోరంట్ల మాధవ్ ను పోలీసు ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేయించి ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్. అదే దివాకర్ రెడ్డి పై పోటీ చేయించి జెసి కుటుంబానికి అవమానపరిచారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి తో  అడుగడుగునా అవమానాలకు గురి చేశారు. ఎన్నో కేసులను ఎదుర్కొంది జెసి కుటుంబం. అయినా సరే ముందుగా  టిడిపిలో కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వైసిపి హవా సాగినా.. తాడిపత్రిలో మాత్రం పట్టు నిలుపుకున్నారు  జెసి ప్రభాకర్ రెడ్డి.
     * అన్యాయంపై జేసీ కుటుంబంలో ఆవేదన 
    ఎన్నికల్లో గెలిచిన జేసీ కుటుంబం.. తమకు జరిగిన అన్యాయం పై మాత్రం బాధపడుతోంది. తమ వ్యాపారాలను అడ్డుకున్నారని, తమపై లేనిపోని కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల వందలాది వాహనాల్లో  జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. అటువంటి ప్రభాకర్ రెడ్డి ఈరోజు వైయస్ విజయమ్మను కలుసుకొని కష్టసుఖాలను పంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విజయమ్మ కుమార్తె షర్మిల వైపు పూర్తిగా టర్న్ అయ్యారని పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇటువంటి సమయంలో ప్రభాకర్ రెడ్డి వెళ్లి తమకు ఎదురైన పరిస్థితిని వివరించినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే విజయమ్మతో ప్రభాకర్ రెడ్డి భేటీ పొలిటికల్ వర్గాల్లో ఒక రకమైన ఆసక్తి రేపుతోంది.