Posani Krishna Murali Emotion
Posani Krishna Murali : ఎట్టకేలకు నటుడు పోసాని కృష్ణ మురళికి( Posani Krishna Murali ) జైలు నుంచి విముక్తి లభించింది. గత నెలలో ఆయన అరెస్టయ్యారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్లి ఆయనను అరెస్టు చేశారు. అటు తరువాత ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. కస్టడీలు కొనసాగుతూ వచ్చాయి. ఒకానొక దశలో ఆయనకు బెయిల్ లభించింది. కానీ సిఐడి పి టి వారెంట్ ఇచ్చి మరోసారి అదుపులోకి తీసుకుంది. అయితే ఎట్టకేలకు సిఐడి కోర్టు బెయిల్ ఇవ్వడంతో రిలీజ్ అయ్యారు పోసాని కృష్ణ మురళి. నిన్ననే గుంటూరులోని సిఐడి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ షరతుల్లో ఒకటైన పూచికత్తు సమర్పణ ఆలస్యం కావడంతో నిన్న ఆయన జైలు నుంచి విడుదల కాలేదు. ఈరోజు మాత్రం విడుదల కావడంతో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే జైలు నుంచి బయటకు వచ్చే క్రమంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అయ్యారు.
Also Read : ఎట్టకేలకు పోసానికి బెయిల్.. ఈసారైనా విడుదలవుతారా?
* వైసిపి హయాంలో దూకుడు
వైసిపి( YSR Congress ) ప్రభుత్వ హయాంలో చాలా దూకుడుగా ఉండేవారు పోసాని కృష్ణ మురళి. జగన్మోహన్ రెడ్డికి బలమైన మద్దతు దారుడిగా నిలిచేవారు . అయితే ఈ క్రమంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు పోసాని కృష్ణ మురళి మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గత నెలలో అరెస్ట్ అయిన తర్వాత ఆయన బెయిల్ కోసం ప్రయత్నించారు. తన ఆరోగ్యం బాగాలేదని జడ్జి ఎదుట కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఆయన చుట్టూ కేసులు నమోదు అవుతూ వచ్చాయి. దీంతో ఆయన బయటకు వచ్చేందుకు కూడా వీలు లేకుండా పోయింది. అయితే తాజాగా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. అయితే మరికొన్ని కేసుల్లో నోటీస్ ఇచ్చి విచారణ జరపాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఏ క్షణం అయినా తిరిగి ఆయనను విచారణకు రమ్మని పిలిచే అవకాశాలు కూడా లేకపోలేదు.
* వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల పరామర్శ
అయితే జైలు నుంచి బయటకు వచ్చిన కృష్ణ మురళిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు. ఈ క్రమంలో మాజీమంత్రి అంబటి రాంబాబును( ambati Rambabu) చూసిన పోసాని కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నపిల్లడి మాదిరిగా రోదిస్తూ కనిపించారు. సుమారు 26 రోజులపాటు ఆయన జైలు జీవితం అనుభవించారు. రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. అయితే ఎప్పటికప్పుడు కస్టడీలు మార్చుతూ.. ఆయనకు వేరువేరు జైలులో కొనసాగించారు. అయితే ఎట్టకేలకు సిఐడి కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఉపశమనం దక్కింది.
Also Read : కేసీఆర్ మాట : పొత్తు లేకుంటే చంద్రబాబు గెలిచేవాడు కాదా?