Posani Krishna Murali (9)
Posani Krishna Murali: ఎట్టకేలకు పోసాని కృష్ణ మురళికి( Posani Krishna Murali ) ఊరట దక్కింది. ఆయనకు బెయిల్ మంజూరు అయ్యింది. సిఐడి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు మోక్షం కలగనుంది. జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబుతో పాటు పవన్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసాని కృష్ణ మురళిని కొద్ది రోజుల కిందట హైదరాబాదులో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో ఆయనను పోలీస్ స్టేషన్లు మార్చుతూ.. కస్టడీల మీద కస్టడీలు కొనసాగిస్తూ వచ్చారు. అన్ని కేసుల్లో బెయిల్ లభించి జైలు నుంచి బయటకు వచ్చిన క్రమంలో సిఐడి పీటి వారెంట్లు ఇచ్చి మరి అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు అదే సిఐడి కోర్టు బెయిల్ ఇవ్వడంతో పోసాని బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: పెద్దిరెడ్డికి షాక్.. అరెస్టుకు లైన్ క్లియర్!
* గత ఐదేళ్లలో దూకుడుగా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి పోసాని కృష్ణమురళి బలమైన మద్దతు దారుడిగా ఉండేవారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడుగా మారారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పోసాని కృష్ణమురళి కి కీలక పదవి దక్కింది. ఏపీ ఫిలిం కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే గత ఐదేళ్లలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు పోసాని కృష్ణ మురళి. అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
* రాజకీయాల నుంచి తప్పుకున్న..
అయితే కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు ఇబ్బందులు తప్పవని పోసాని కృష్ణమురళీ గ్రహించారు. అందుకే కొద్ది రోజుల కిందట తనకు రాజకీయాలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడడానికి కూడా తేల్చేశారు. అయితే ఉన్నట్టుండి ఆయనపై ప్రకాశం జిల్లాలో ఫిర్యాదు వచ్చింది. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ పోసాని కృష్ణమురళిని అరెస్టు చేశారు. అది మొదలు ఆయన పై కేసులు నమోదవుతూ వచ్చాయి. కస్టడీలు కొనసాగాయి. కొద్దిరోజుల కిందట కర్నూలు జిల్లా కోర్టులో అన్ని కేసులకు సంబంధించి బెయిల్ లభించింది. అయితే ఇంతలో సిఐడి అధికారులు అక్కడకు వెళ్లారు. పీటీ వారెంట్లు ఇచ్చారు. అదుపులోకి తీసుకొని గుంటూరు జిల్లా జైలుకు పంపించారు. అయితే ఆ కేసు విచారణ చేపట్టిన సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైలు నుంచి పోసాని బయటకు రావడం ఖాయమని తేలిపోయింది. అయితే గత అనుభవాల దృష్ట్యా మరి కొన్ని కేసులు వచ్చి పడతాయి అన్న అనుమానం కూడా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.