Poonur Gautham Reddy: విజయవాడ వైసీపీలో పూనూరు గౌతమ్ రెడ్డిది యాక్టివ్ రోల్. వైసీపీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా ఉన్నారు ఆయన. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. జగన్ కు అత్యంత ప్రియ శిష్యుడు కూడా. ఈయన కోసం వంగవీటి రాధాకృష్ణను జగన్ వదులుకున్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. అంతటి ప్రాధాన్యం ఇచ్చేవారు గౌరవం గౌతమ్ రెడ్డికి. ఇటీవల కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి పేరును కూడా ప్రకటించారు. అయితే ఇటీవల ఆ ఎన్నికలను బహిష్కరించింది వైసిపి. అయితే తాజాగా అదే గౌతమ్ రెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదయింది. విజయవాడలో కలకలం రేపిన సుపారీ గ్యాంగ్ తో హత్యాయత్నం కేసులో ప్రధాన సూత్రధారి గౌతమ్ రెడ్డి అని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను బయటపెట్టారు. విజయవాడలో ఓ స్థలాన్ని కబ్జా చేసి.. దాని యజమానిని అడ్డు తొలగించేందుకు ఓ ముఠాతో 25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. గౌతమ్ రెడ్డి తో పాటు మరో నలుగురు పరారీలో ఉన్నారు.
* కేసు వివరాలను వెల్లడించిన సిపి
తాజాగా ఈ కేసునకు సంబంధించి వివరాలను విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ ఎస్ వి రాజశేఖర్ బాబు వివరించారు. నిందితుల వివరాలను సైతం వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత గౌతమ్ రెడ్డి పై ఉన్న కేసుల వివరాలను సైతం ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో వివిధ సెక్షన్ల కింద గౌతంరెడ్డి పై 42 కేసులు ఉన్నట్లు తెలిపారు. 1988 నుంచి కేసులు నడుస్తున్నాయని.. ఒక్క సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 23 కేసులు ఉన్నట్లు చెప్పారు సిపి.వాటిలో రెండు హత్య, రెండు హత్యాయత్నంతో పాటు దోపిడీ, చీటింగ్ వంటి తీవ్ర నేరాభియోగాలు ఉన్నాయని..కొట్లాట,దౌర్జన్యం వంటి కేసులు ఉన్నాయని కూడా తెలిపారు.
* ఈ కేసులోనే
తాజాగా ఈ సుపారీ హత్యకు సంబంధించి కేసు వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన గండూరి ఉమామహేశ్వర శాస్త్రి.. తన తల్లి పేరిట ఉన్న 325 గజాల స్థలాన్ని గౌతమ్ రెడ్డి ఆక్రమించారన్నది ప్రధాన ఆరోపణ. 2017 లోనే దీనిపై ఉమామహేశ్వర శాస్త్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు గౌతమ్ రెడ్డికి నోటీసులు అందించారు. కానీ గౌతమ్ రెడ్డి మాత్రం కోర్టును ఆశ్రయించారు. ఇంతలో వైసీపీ అధికారంలోకి రావడం.. ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడం జరిగిపోయింది. అయితే తన ఆస్తిని ఆక్రమించారని ఉమామహేశ్వర శాస్త్రి సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దీనిని సహించలేకపోయిన గౌతంరెడ్డి ఉమామహేశ్వర శాస్త్రిని హత్య చేయాలని ఓ గ్యాంగ్ తో సుపారి మాట్లాడుకున్నారు.ఈ క్రమంలోనే శాస్త్రి ఇంటి వద్ద అక్టోబర్ 31నరెక్కీ నిర్వహించారు. నవంబర్ 6న హత్యకు ప్రయత్నించారు. అయితే దీనిపై సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులకు.. గౌతమ్ రెడ్డి సూత్రధారి అని తేలింది. ఈ వ్యవహారంపై టీడీపీ ఎక్స్ వేదికగా స్పందించింది. ‘ తన సైకోబాస్ బాబాయిని లేపేసిన అనుభవం నుంచి పాఠాలు నేర్చుకుని.. 25 లక్షల సుపారీ ఇచ్చి.. విజయవాడలో బ్రాహ్మణుడిని చంపాలని ప్లాన్ చేశారు జగన్ ప్రియ శిష్యుడు గౌతమ్ రెడ్డి. దానిని పసిగట్టి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు’ అని పోస్ట్ చేసింది. ఈ పోస్టు ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది.