Political Retaliation:రాజకీయాల్లో( politics) ప్రత్యర్థులను గౌరవించే రోజులు పోయాయి. ప్రతీకార రాజకీయం నడుస్తున్న రోజులు ఇవి. నవ్యాంధ్రప్రదేశ్ లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు చంద్రబాబు. ఆ సమయంలో నారా కుటుంబమంతా రాజమండ్రిలోనే గడపాల్సి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి పెద్దిరెడ్డి కుటుంబానికి ఎదురైంది. మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ వచ్చేవరకు ఆయన జైల్లో ఉండక తప్పదు. అందుకే మిధున్ రెడ్డి కోసం ఆ కుటుంబం అంతా ఇప్పుడు రాజమండ్రి మకాం మార్చడం విశేషం.
Also Read: ఢిల్లీ స్కాం కంటే పది రెట్లు.. సెగలు పుట్టిస్తున్న ఏపీ మద్యం కుంభకోణం!
అప్పట్లో చంద్రబాబుకు సైతం..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్( skill development scam) కేసులో అరెస్ట్ అయ్యారు చంద్రబాబు. ఓ జిల్లా పర్యటనలో ఉండగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయనను అరెస్టు చేశారు. రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చారు. అటు తర్వాత చాలా రకాల కేసులు నమోదు చేస్తూ వచ్చారు. దీంతో చంద్రబాబుకు బెయిల్ దక్కలేదు. 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండి పోవాల్సి వచ్చింది. అయితే నాడు జైల్లో ప్రత్యేక వసతుల కోసం కోర్టులో పిటిషన్ వేశారు. ఇంటి భోజనం కోసం అనుమతులు పొందారు. దీంతో లోకేష్ రాజమండ్రిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. కుటుంబంతో పాటు అక్కడే ఉండేవారు. నారా భువనేశ్వరి ప్రతిరోజు భోజనం వండి జైలుకు తీసుకెళ్లేవారు. మరోవైపు లోకేష్ ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు బెయిల్ కోసం పోరాటం చేసేవారు. అయితే ఈ పరిస్థితిని టిడిపి శ్రేణులు అప్పట్లో ఎంతో ఆవేదనతో గడిపేవి.
Also Read: పరుపు, దిండు, ఓ దోమతెర.. జైల్లో మిథున్ రెడ్డి కోరికల చిట్టా
ఇంటిని అద్దెకు తీసుకున్న పెద్దిరెడ్డి..
అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబానికి అదే పరిస్థితి వచ్చింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా మారిపోయారు. ఇప్పట్లో ఆయనకు బెయిల్ వచ్చే అవకాశం లేదని ప్రచారం సాగుతోంది. అందుకే మిధున్ రెడ్డి జైల్లో తనకు ప్రత్యేక వసతులు కావాలని కోరారు. ఇంటి భోజనానికి కోర్టు వద్ద అనుమతి తీసుకున్నారు. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడి కోసం రాజమండ్రిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడి నుంచి జైల్లో ఉన్న కుమారుడికి ప్రతిరోజు భోజనం, మూలాఖత్ లో కలవడం వంటివి చేస్తారని తెలుస్తోంది. నాడు చంద్రబాబు కుటుంబానికి ఎదురైన పరిస్థితులే.. నేడు పెద్దిరెడ్డి కుటుంబానికి ఎదురు కావడం విశేషం.