Political films : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో పొలిటికల్ సెటైర్స్ చిత్రాలు తెరపైకి వస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ వ్యూహాం చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏపీ సీఎం జగన్ బయోపిక్ గా వస్తున్న ఈ చిత్రంలో వైఎస్ మరణం తరువాత ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు, సీబీఐ కేసులు, జైలుజీవితం, వైసీపీ ఆవిర్భావం గురించి ఫస్ట్ పార్ట్ చూపించనున్నారు. 2014 తరువాత ఎదురైన పరిణామాలు, చంద్రబాబు సర్కారులో జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులు, మహా ప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్ర, 2019లో గెలుపు, ఈ నాలుగేళ్లలో ఎదుర్కొన్న పరిస్థితులను సెకెండ్ పార్టులో చూపించనున్నారు. ఎన్నికల ముంగిట రెండో పార్టును రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.
ఇటీవల వ్యూహం సినిమాకు సంబంధించి ట్రయలర్ ను విడుదల చేసిన ఆర్జీవీ అంచనాలను పెంచారు. ఇది పూర్తిగా జగన్ కు అనుకూలంగా తీస్తున్న పక్కా పొలిటికల్ స్కెచ్ చిత్రాలు అని తేలిపోయాయి. అలాగే ఇటువంటి చిత్రానికి సంబంధించి ఒక అప్ డేట్ బయటకు వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర సినిమాను తీసిన మహీ రాఘవన్ ఈసారి జగన్ బయోపిక్ పై ఫోకస్ పెంచారు. గత ఎన్నికల ముందు యాత్రతో మెగాఫోన్ అందుకున్న రాఘవన్ ఇప్పుడు యాత్ర 2 కు సిద్ధపడుతున్నారు. ఇందుకు సంబంధించి సినిమా అప్ డేట్ ను సైతం వెల్లడించారు.

అయితే ఈ చిత్రాన్ని మహీ వీ రాఘవన్ సిక్వెల్ గా తీస్తున్నారు. సాధారణంగా సిక్వెల్ అంటే ఒకే మనిషి గురించి రెండు పార్టులుగా చూపించడం. ఎన్టీఆర్ కథనాయకుడు, నాయకుడు చిత్రాలు అన్నమాట. బాహుబలి, బహుబలి 2 కూడా సిక్వెల్ కిందకే వస్తాయి. అయితే యాత్ర 2 మాత్రం అందుకు భిన్నం. యాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, యాత్ర 2లో జగన్ పాదయాత్రను వైవిధ్యంగా చూపించనున్నారు. మధ్యలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ను చూపి పొలిటిక్ డ్రామాను పండించనున్నారు. యాత్ర మాదిరిగానే కొన్నిఅంశాలను ప్రత్యేకంగా చూపించనున్నారు.
యాత్ర 2కు సంబంధించి పోస్టర్ తో పాటు డైలాగును కూడా విడుదల చేశారు. ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’’ అనే డైలాగును చిత్రానికి సంబంధించి విడుదల చేసిన పోస్టర్లలో వాడారు. 2024 ఫిబ్రవరి నాటికి సినిమా విడుదల కానున్నదని ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికల సమయానికి, గత ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్ర రూపంలో పడిన కష్టం, చేసిన త్యాగం మొత్తం ప్రజలకు మరొక్కసారి గుర్తుచేసేలా సినిమా రూపొందుతుందని ఆశించవచ్చు. యాత్ర సినిమా నిర్మాత అయిన శివ మేక.. యాత్ర 2ను సైతం నిర్మిస్తుండడం విశేషం.
ఎన్నికల ముంగిట వరుసగా వచ్చే ఈ సినిమాలు పార్టీకి ప్లస్ పాయింట్ గా నిలుస్తాయని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే జగన్ తో పాటు వైసీపీ నేతలకు అండగా నిలబడుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వలో వస్తున్న చిత్రాలు కావడంతో మరింత స్కోప్ నివ్వనున్నారు. పూర్తిగా చంద్రబాబును విలన్ గా చిత్రీకరించేందుకు వెనుకాడని వైనాన్ని ట్రయలర్ లో చూపారు. మరోవైపు యాత్రతో రాజశేఖర్ రెడ్డిలో ఉన్న మంచి కోణాలను చూపారు మహీ వీ రాఘవన్. ఇప్పుడు జగన్ ను సైతం కొత్త కోణంలో చూపేందుకు తపన పడతారు. మొత్తానికైతే ఎన్నికల ముంగిట వైసీపీకి అనుకూలంగా చిత్రాలు రానున్నాయన్న మాట. మరి ప్రేక్షకులకు ఎంతవరకూ ఆకట్టుకుంటాయో చూడాలి మరీ.