Bandaru Satyanarayana : ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన్ను ఏ క్షణమైనా అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెల పాలెం లోని ఆయన నివాసం చుట్టూ పోలీసులు మోహరించారు. వందలాదిమంది చుట్టుముట్టారు. కొద్ది రోజుల కిందట మంత్రి రోజాను టార్గెట్ చేసుకొని సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డారు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో మంత్రి రోజా స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు మంత్రి రోజా తీరుపై భగ్గుమన్నాయి. చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఆయన భార్య భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. రాజమండ్రిలో ఉంటూ ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో వీరిపై కూడా మంత్రి రోజా విమర్శలు చేశారు. తప్పు చేసిన చంద్రబాబుకు వత్తాసు పలకడం ఏమిటని ప్రశ్నించారు. కొన్ని వ్యక్తిగత కామెంట్లు సైతం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి రోజా తీరుపై టిడిపి శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి.ఆమె వ్యాఖ్యలను ఖండించాయి.
అయితే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఒక అడుగు ముందుకేసి మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా నీ గత జీవితం ఇది అంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. నువ్వా నందమూరి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడేది అంటూ విరుచుకుపడ్డారు. సినిమా రంగంలో ఉంటూ.. నువ్వు ఏమేం చేశావో తెలుసు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే అనూహ్యంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఒక మంత్రిని టార్గెట్ చేసుకొని అలా మాట్లాడడం తగదని.. ఇంకా సాధారణ మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. దీనిపై మహిళా కమిషన్ కలుగజేసుకోవాలని కోరారు. ఈ తరుణంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాష్ట్ర డిజిపి కి లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే బండారు సత్యనారాయణమూర్తి అరెస్టుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు.
ప్రస్తుతం బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. అటు టిడిపి శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత పోలీసు బృందాలు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎవర్నీ లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులతో టిడిపి నేతలు వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే బండారు సత్యనారాయణమూర్తికి 41 ఏ నోటీసు ఇచ్చి అరెస్టు చేసేందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఓ మహిళా మంత్రిపైనే వ్యాఖ్యలు చేయడంతో.. ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగినట్టు సమాచారం.