AP Election Survey 2024: వైసీపీ ఆవిర్భావం నుంచి ఎస్సీలు ఆ పార్టీ వెంట నడుస్తున్నారు. ఎస్టీలు సైతం ఆదరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో సైతం ఆ రెండు వర్గాలు వైసిపికి అండగా నిలిచాయి. 2019లో మాత్రం ఏకపక్షంగా మద్దతు తెలిపాయి. మొత్తం 36 రిజర్వ్ నియోజకవర్గాలకు గాను.. 34 చోట్ల వైసిపి ఏకపక్ష విజయం సాధించింది. అయితే ఈసారి ఎందుకో ఆ రెండు వర్గాలు వైసీపీ పై అనుమానపు చూపులు చూస్తున్నాయి. గత ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాలు లేకపోగా.. ఉన్న వాటిని సైతం తొలగించారు. దశాబ్దాలుగా వస్తున్న రాజ్యాంగబద్ధ కేటాయింపులను సైతం రద్దు చేశారు. దీంతో ఆ రెండు వర్గాల్లో వైసీపీకి అసంతృప్తి కనిపిస్తోంది. తాజాగా ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ఇదే తేలింది. గత ఐదు సంవత్సరాలుగా చర్యలతో ఆ రెండు వర్గాలు దూరమయ్యాయి అని తెలుస్తోంది.
పీపుల్స్ పల్స్ ట్రాకర్ పోల్ అనే సంస్థ తాజాగా ఓ సర్వే చేపట్టింది. 29 ఎస్సీ నియోజకవర్గాలతో పాటు ఏడు ఎస్టి నియోజకవర్గాల్లో సర్వే చేసింది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ గెలుస్తుంది అనే అంశంపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇందులో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ప్రజలు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు. ఎస్టీ నియోజకవర్గాల్లో మాత్రం యధావిధిగా కనిపిస్తోంది. మొత్తం 29 ఎస్సీ నియోజకవర్గాలకు గాను.. 19 చోట్ల టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలిచే ఛాన్స్ ఉంది. పది చోట్ల మాత్రం వైసిపి విజయం సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది.ఇక ఎస్టీ నియోజకవర్గాల విషయానికి వస్తే.. ఏడు నియోజకవర్గాల్లో, ఐదు చోట్ల వైసీపీ గెలుపొందే అవకాశం ఉంది. రెండు చోట్ల మాత్రం ఓటమికి స్పష్టత కనిపిస్తోంది.
ప్రధానంగా ఎస్సీ నియోజకవర్గాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో వైసిపి ఏకపక్షంగా విజయం సాధించింది. కానీ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టడం, చాలా రకాల పథకాలు నిలిచిపోవడం వంటి కారణాలతో ఎస్సీల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. మరోవైపు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎన్డీఏకు మద్దతు తెలిపారు. దీంతో మాదిగలు ఏకపక్షంగా కూటమి వైపు వచ్చారు. 29 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో.. మాదిగలు ఎక్కువగా ఉన్న చోట్ల కూటమి గెలుపొందే అవకాశం ఉంది.ఈ నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమికి 51.81%, వైసీపీకి 42.83% ఓట్లు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ 27 చోట్ల గెలిచింది. టిడిపి, జనసేన చెరో స్థానం దక్కించుకున్నాయి.
ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఏడు స్థానాలకు గాను
.. ఐదు చోట్ల వైసీపీ విజయం సాధించనుంది. రెండు చోట్ల కూటమి గెలిచే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఏడు స్థానాలను వైసిపి కైవసం చేసుకుంది. వైట్ వాష్ చేసింది. కానీ ఈసారి ఆ స్థాయి ఫలితాలు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఈసారి గిరిజనుల్లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మొత్తానికైతే రిజర్వుడు నియోజకవర్గాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి.