Janasena : ఏపీలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. రోడ్డు వెంబడి గోతులు కాదు… గోతుల్లో రోడ్డు వెతకాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. సాయంత్రం 5 దాటితే ప్రయాణం ప్రమాదంతో కూడుకున్నదే. గత నాలుగేళ్లుగా రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం చొరవచూపలేదు. దాదాపు 45 వేల కిలోమీటర్ల మేర రహదారులు దారుణంగా దెబ్బతిన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజా వర్షాలకే 15 వేల కిలోమీటర్ల మేర రోడ్డు పాడయ్యాయని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేశారు. సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి లక్ష్యాలు, గడువులు విధిస్తున్నా ఫలితం లేకపోతోంది.
బటన్ నొక్కుడుకే సీఎం జగన్ పరిమితమవుతున్నారన్న అపవాదు ఉంది. ప్రభుత్వ పాలన పడకేసిందని.. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎప్పటికప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల్లో వరినాట్లు వేసి జన సైనికులు నిరసన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సొంత నిధులతో రోడ్డు బాగుచేసిన దాఖలాలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వం స్పందించి ప్రధాన మార్గాల్లో రహదారి గోతుల్లో చిప్స్ కప్పి చేతులు దులుపుకుంది. ఎన్నికలకు పట్టుమని పది నెలలు లేకపోవడంతో ఈ రహదారులు బాగుచేస్తారన్న ఆశను ప్రజలు వదులుకున్నారు.
తమ గ్రామానికి రహదారి వేయాలంటూ ఓ ఎంపీటీసీ సభ్యుడు రోడ్డు గుంతలో కూర్చొని నిరసన తెలపడం హాట్ టాపిక్ గా మారింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం పెండ్యాల రహదారి దారుణంగా తయారైంది. దారిపొడవునా భారీ గోతులతో గ్రామస్థులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీకావు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో గోతుల్లో నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. రహదారిని బాగుచేయాలని వైసీపీ ప్రజాప్రతినిధులు, అధికారులను విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదు. గ్రామస్థులు జనసేనకు మద్దతు తెలుపుతుండడంతో మరింత వివక్ష చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఎంపీటీసీ సభ్యుడు వాకా శ్రీను (ఇంద్ర) రహదారి గుంతలో కూర్చొని చేపట్టిన ఆందోళన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.