Kodali Nani: రాజకీయాల్లో కొంతవరకే దూకుడు పనికొస్తుంది. ఎల్లవేళలా ఆ దూకుడు కనబరుస్తామంటే కుదిరే పని కాదు. ఇప్పుడు వైసీపీ ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ సైతం అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మీడియా ముందుకు వస్తే చాలు రాజకీయ ప్రత్యర్థుల తో పాటు సొంత పార్టీలోని వ్యతిరేకులపై విరుచుకుపడుతుంటారు. అయితే నామినేషన్ ప్రక్రియలో ఎదురైన పరిణామాలతో వారు షాక్ తిన్నారు. జనం ముఖం చాటేయడంతో నిరాశకు గురయ్యారు. జన సమీకరణ చేయకపోవడంపై సొంత పార్టీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. నిన్నటి నామినేషన్ ర్యాలీలు చూస్తే వీరిద్దరిని ప్రజలు పక్కన పెట్టినట్టేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.ముఖ్యంగా కొడాలి నాని గత నాలుగు ఎన్నికల్లో వరుసగా గుడివాడ నుంచి గెలుపొందుతూ వస్తున్నారు. ఈసారి కూడా గెలుస్తానని ధీమాతో ఉన్నారు. గత ఐదేళ్లుగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ వస్తున్నారు. రాజకీయంగా ఫైర్ బ్రాండ్ గా మారినా..అది నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం అక్కరకు రాలేదని గుడివాడ ప్రజలు భావిస్తున్నారు. అందుకే ఆయన నామినేషన్ ర్యాలీతో పాటు ఎన్నికల ప్రచారానికి కూడా పెద్దగా స్పందించడం లేదు. ఇది కొడాలి నానికి మింగుడు పడని విషయం.

అటు గన్నవరంలో వల్లభనేని వంశీ పరిస్థితి బాగాలేదు. ఆయన నామినేషన్ ర్యాలీ సైతం వెలవెలబోయింది. దీంతో ఒక్కసారిగా వంశీకి తత్వం బాధపడింది. ఆయనలో మార్పు వచ్చింది. సొంత పార్టీ నేత దుట్టా రామచంద్ర రావు విషయంలో సానుకూల ప్రకటనలు చేయడం ప్రారంభించారు. ఇన్నాళ్లు పకోడీగాళ్లంటూ హేళనగా మాట్లాడే వంశి.. తాజాగా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రామచందర్రావు కుమార్తెను ఎమ్మెల్యే చేస్తానని చెప్పుకొచ్చారు.
గన్నవరంలో వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తన వెంట వైసీపీలోకి వచ్చిన టిడిపి శ్రేణులు హ్యాండ్ ఇచ్చారు. ఇన్నాళ్లు తమను ఇబ్బంది పెట్టారన్న కోణంలో వైసీపీ శ్రేణులు సైతం పెద్దగా హాజరు కాలేదు. దీంతో నామినేషన్ ర్యాలీ తేలిపోయింది. ఈ పరిస్థితిని ఊహించని వంశీకి ఇప్పుడు దుట్టా రామచంద్రరావు దిక్కయ్యారు. ఆయన సపోర్ట్ చేయకుంటే మరింత దిగజారుడు తప్పదని వంశి భయపడుతున్నారు. అందుకే దుట్టా వర్గం సపోర్ట్ కోసం ఆయన కుమార్తెకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మద్దతు ఇస్తానని వంశీ ప్రకటించారు. అయితే ఎలా ఉన్న వంశీ.. ఇలా మారారేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ప్రస్తుతం వైసీపీలో వల్లభనేని వంశీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఆయన వెంట వచ్చిన టిడిపి శ్రేణులు 90 శాతం తిరిగి యుటర్న్ తీసుకున్నాయి. యార్లగడ్డ వెంకట్రావు రూపంలో బలమైన నాయకత్వం దొరకడంతో మొత్తం శ్రేణులు ఏకమయ్యాయి. అదే సమయంలో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ లోని మెజారిటీ వర్గాన్ని తన వైపు తిప్పుకోగలిగారు. ఈ పరిస్థితిని ఊహించని వంశీ దూకుడుగా ముందుకు వెళ్లారు. దుట్టా రామచంద్రరావు వర్గం అవసరం తనకు లేదని భావించారు. కానీ నామినేషన్ ర్యాలీలో ఎదురైన పరిణామాలతో తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇప్పటివరకు దుట్టా రామచంద్రరావును పురుగును చూసినట్టు చూసిన.. ఎన్నికల్లో ఎదురు కాబోయే పరిణామాలను ఊహించారు. అందుకే దుట్టా రామచంద్ర రావు కుమార్తెకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మద్దతు తెలుపుతానని ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో వల్లభనేని వంశీలో ఉన్న బేలతనం బయటపడింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.