Jagan Vs Sharmila: చెల్లి చీరపై కామెంట్స్ చేస్తావా? జగన్ కు ఇచ్చిపడేసిన షర్మిల

షర్మిల కుమారుడి వివాహం కొద్ది రోజుల కిందట జరిగిన సంగతి తెలిసిందే.హైదరాబాదులో నిశ్చితార్థ వేడుకలు జరగగా.. రాజస్థాన్లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

Written By: Dharma, Updated On : April 26, 2024 11:23 am

Jagan Vs Sharmila

Follow us on

Jagan Vs Sharmila: సీఎం జగన్ ఎందుకో సహనం కోల్పోతున్నారు. ముఖ్యంగా షర్మిల విషయంలో ఆయన నోరు జారుతున్నారు. పులివెందులలో నామినేషన్ వేసిన సందర్భంగా భారీసభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభలో చేసిన ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ముఖ్యంగా షర్మిల ధరించిన పసుపు చీరను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు విమర్శలకు కారణమవుతున్నాయి. రాజకీయాలు అన్నాక విమర్శలు హుందాగా ఉండాలి కానీ.. మహిళల విషయంలో అలా మాట్లాడడం సరికాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సొంత సోదరి విషయంలో జగన్ అలా అనేసరికి సహజంగానే విమర్శలు ప్రారంభమయ్యాయి.అటు సీఎం వ్యాఖ్యలు సొంత పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యపరిచాయి.

షర్మిల కుమారుడి వివాహం కొద్ది రోజుల కిందట జరిగిన సంగతి తెలిసిందే.హైదరాబాదులో నిశ్చితార్థ వేడుకలు జరగగా.. రాజస్థాన్లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. జగన్ తో పాటు అన్ని పార్టీల అధినేతలకు షర్మిల స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందించారు. జగన్ కు అతి కష్టం మీద ఆహ్వాన పత్రికలు అందించినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో చంద్రబాబుకు ప్రత్యేకంగా షర్మిల వెళ్లి ఆహ్వాన పత్రికను అందించారు. ఆ సమయంలో ఆమె పసుపు రంగు చీరను ధరించారు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. షర్మిల వెనుక చంద్రబాబు ఉన్నారన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

అయితే తాజాగా జగన్ తన సోదరి ధరించిన చీర గురించి ఒక సభలో ప్రస్తావించడం విమర్శలకు తావిస్తోంది. సహజంగానే మహిళలు శుభ సూచికంగా పసుపు చీరను ధరిస్తారు. ఎక్కువమంది పసుపు రంగును ఇష్టపడతారు. ఆరోజు అదే మాదిరిగా పసుపు రంగు చీరను ధరించి షర్మిల ఆహ్వాన పత్రికలను చంద్రబాబుకు అందించారు. దానిని ఇప్పుడు జగన్ తప్పు పడుతుండడం కొద్దిపాటి విమర్శలకు కారణమవుతోంది. సోషల్ మీడియా వేదికగా నాడు జరిగిన ప్రచారాన్ని ఎక్కువమంది ఖండించారు. అసలు శుభకార్యాలకు పిలవలేని విధంగా రాజకీయాలు మార్చాలా? అని ఎక్కువ మంది కామెంట్స్ చేశారు.

అయితే తాజాగా జగన్ చేసిన కామెంట్స్ పై షర్మిల స్పందించారు. వేలమంది మగవారు ఉన్న బహిరంగ సభలో సొంత చెల్లి అని చూడకుండా తన చీర గురించి ప్రస్తావిస్తారా? నేను పసుపు పచ్చ చీర కట్టుకున్నానట. పచ్చ చీర కట్టుకొని చంద్రబాబుకు మోకరిల్లినట్లు జగన్ చెప్పడాన్ని ఏమనుకోవాలి. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నానట. పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది? చంద్రబాబు ఏమైనా పచ్చ రంగు కొనుక్కున్నారా? పసుపు రంగు పై చంద్రబాబుకు ఏమైనా పేటెంట్ ఉందా? అంటూ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దుస్తులు గురించి మాట్లాడుతుంటే సభ్యతగా ఉందని అనుకోవాలా? జగన్ రెడ్డికి అసలు సంస్కారం ఉందా? అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్న విషయంపై జగన్ చేసిన విమర్శలను షర్మిల గుర్తు చేశారు. నేను చంద్రబాబు స్క్రిప్టును చదువుతున్నానో లేదో ప్రజలకు తెలుసునని.. బిజెపి, ప్రధాని మోదీ మోకరిల్లింది జగన్మోహన్ రెడ్డి అని షర్మిల తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారు. ఢిల్లీ వెళ్లినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా స్వప్రయోజనాల కోసం పాకులాడింది మీరు కాదా అంటూ షర్మిల ప్రశ్నించారు. వైయస్సార్ కు జగన్ వారసుడు కాదు. మోడీకి వారసుడు. మోడీకి దత్తపుత్రుడు అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మొత్తానికైతే జగన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు షర్మిల.