Peddireddy Ramachandra Reddy: వైసీపీలో సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది ప్రత్యేక స్థానం. పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు పెద్దదిక్కుగా ఉన్నారు. మొత్తం రాయలసీమనే శాసించారు పెద్దిరెడ్డి. అటువంటి పెద్దిరెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కేవలం జగన్ తో సమావేశాలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. జిల్లాల వారీగా టాస్క్ ఫోర్సును నియమించారు జగన్. కానీ ఎక్కడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ.. ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఆ జాబితాలో లేవు. ఆయన ఎందుకో పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. చిత్తూరు జిల్లా బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు రాకపోవడంతో.. భూమన కరుణాకర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు జగన్. అయితే పెద్దిరెడ్డి లో ఈ మార్పు వైసీపీలో చర్చకు దారితీస్తోంది. ఆయన కూటమి ప్రభుత్వానికి భయపడినట్లు అర్థమవుతోంది.
* పెద్దిరెడ్డిని నమ్మిన జగన్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చాలా నమ్మారు జగన్. పెద్దిరెడ్డి కూడా రాయలసీమ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. వందల కోట్లు వెనకేసుకున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా రకాల ఘోరాలకు పాల్పడ్డారు. ఆయన చేసిన కబ్జాలు సైతం బయటపడ్డాయి. చాలావరకు కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. వాటిలో చేసిన నిర్వాకాలు కూడా అలానే ఉన్నాయి. అందుకే పెద్దిరెడ్డి సైలెంట్ గా ఉంటున్నారు. రాజకీయంగా కొంతకాలం పాటు సైలెంట్ గా ఉంటామని సంకేతాలు పంపుతున్నారు. వాస్తవానికి చంద్రబాబు సాయంతోనే ఆర్థికంగా నిలదొక్కుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ అదే చంద్రబాబును కుప్పంలో ఓడిస్తానని శపధం చేశారు. అందుకు వందల కోట్ల రూపాయలతో చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ ఆ ప్రయత్నంలో విఫలమయ్యారు.
* సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే భయం
ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది. కానీ పుంగనూరు నుంచి గెలిచారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజంపేట ఎంపీగా గెలిచారు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి. అయితే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు ఆ ఇద్దరు తండ్రీ కొడుకులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతంలో తాము వ్యవహరించిన మాదిరిగానే టిడిపి శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణం వందలాది లారీలను ఆఫ్రికాకు తరలించేసారన్న ఆరోపణలు ఉన్నాయి.ఏపీతో పాటు ఎక్కడా వ్యాపారం చేయలేమని ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత ఆఫ్రికాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే కొద్ది రోజులు పాటు తమకు ఇబ్బందులు ఉంటాయని.. తాము అంత యాక్టివ్ గా పని చేయలేమని జగన్ కు పెద్దిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న జగన్ పెద్దిరెడ్డి ఆ మాట అనేసరికి కంగారు పడిపోయినట్లు సమాచారం.