Pawankalyan : పవన్ ఎలా ఉన్నా.. ఏం మాట్లాడినా సంచలనమే. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పిన పవన్ సెడన్ గా జనసేనకు మాత్రమే ఓటెయ్యాలని.. తనకు సీఎం చాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు. అది మొదలు విశ్లేషణలు, స్ట్రాటజీలు మారిపోయాయి. ఇప్పుడు తాజాగా ఆయన పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలిచ్చారు. పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి రాజకీయంగా కొత్త అలజడిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా పొత్తులపై ప్రభావం చూపేలా కామెంట్స్ ఉన్నాయి. తాను స్పష్టంగా ఉన్నానని.. తేల్చుకోవాల్సింది బీజేపీ, టీడీపీలేని తేల్చి చెప్పిన తీరు ఆకట్టుకుంటోంది.
పొత్తుల విషయంలో ఏకాభిప్రాయ సాధన అనేది చాలా కష్టమని పవన్ చెబుతున్నారు. మూడు పార్టీల కలయిక విషయంలో ఉత్పన్నమయ్యే సమస్యలు, సీట్ల సర్దుబాటు విషయంలోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక జాతీయ పార్టీతో రెండు బలమైన ప్రాంతీయ పార్టీల కలయిక జరిగితే ఒక స్థిర నిర్ణయానికి రావడం అంత అషామాషీ విషయం కాదని పవన్ కు అర్ధమైనట్టుంది. అందుకే ఆయన పొత్తు ప్రతిపాదన అనేది ఏ స్థాయిలో ఉండాలో ఏకాభిప్రాయం ద్వారానే సాధ్యమని తేల్చేశారు. దీంతో బంతిని టీడీపీ, బీజేపీ కోర్టులో నెట్టారన్న మాట. ఎంతో లోతైన విశ్లేషణ, శోధన ద్వారాయే పవన్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
పొత్తులపై ముందడుగు వేసింది పవనే. అటు చంద్రబాబుతో మూడుసార్లు సమావేశమయ్యారు. కానీ పొత్తలపై మాట్లాడుకోలేదని చెబుతున్నారు. అయితే పొత్తుల విషయంలో టీడీపీ నుంచి వచ్చిన ఆఫర్లు పవన్ కు ఇబ్బంది తెచ్చినట్టున్నాయి. గౌరవప్రదమైన, ఆశించిన స్థాయిలో సీట్ల ఆఫర్ కనిపించలేదు. అందుకే వ్యూహాత్మకంగా సైలెంట్ అయినట్టు వార్తలు వచ్చాయి. పొత్తులపై మరింత చొరవ తీసుకుంటే బేరం చేసే శక్తిని కోల్పోతామని పవన్ కు తెలుసు. అందుకే ఆయన అచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న కొలదీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముందని.. అందుకే తన మానాన తాను పార్టీ వాయిస్ ను వినిపిస్తున్నానని పవన్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి.