TDP Vs BJP : బీజేపీకి దగ్గర కావాలన్న చంద్రబాబు ప్రయత్నం బెడిసికొట్టిందా? అందుకే రివర్స్ అవుతున్నారా? ప్రత్యేక హోదా నినాదాన్ని బయటకు తీశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం చంద్రబాబుపై ఫైర్ అవుతుండడంతో అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల వరకూ బీజేపీ కోసం చంద్రబాబు ఆరాటపడ్డారు. కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. దీంతో టీడీపీతో కమలం దోస్తీ చేస్తుందని అంతా భావించారు. కానీ ఏపీ వచ్చిన బీజేపీ అగ్రనేతలు దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సొంత పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయలేదు. దీంతో టీడీపీని బీజేపీ నమ్మదంటూ రాష్ట్ర బీజేపీ నేతలు కొత్త పల్లవి అందుకున్నారు.
మొన్నటివరకూ బీజేపీతో కలిసి నడిచేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. అందుకు సోము వీర్రాజులాంటి నాయకులు అడ్డంకిగా భావించారు. అందుకే బీజేపీలోని తన టీమ్ ద్వారా చాలావరకూ ప్రయత్నించారు. బీజేపీ అగ్రనేతలు మెత్తబడ్డారన్న వార్తలు వచ్చాయి. అందుకే చంద్రబాబును చర్చలకు పిలిచారని ప్రచారం జరిగింది. సహజంగానే ఈ సంకేతాలు రాష్ట్ర బీజేపీ నాయకులకు కలవరపాటుకు గురిచేశాయి. హైకమాండ్ మనసులో ఏముందో తెలియక వారు కాస్తా సైలెంట్ నే ఆశ్రయించారు. అటు బీజేపీకి స్నేహహస్తం అందిస్తూనే టీడీపీ నాయకులు డ్యామేజీకి సిద్ధమయ్యారు. జగన్ సర్కారుకు బీజేపీ సహకారం పుష్కలంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కామెంట్స్ చేశారు.
మరోవైపు చంద్రబాబు కొత్తగా ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు. గత ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా వద్దని.. దానికి సమానంగా ప్యాకేజీ చాలని చంద్రబాబు ఒప్పుకున్నారు. ప్రత్యేక హోదా ఏమైనా అపర సంజీవినా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రత్యేక హోదా బయటకు తీయడం బీజేపీలో అనుమానాలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు ఏదో కొత్త స్కెచ్ వేస్తున్నారన్న అనుమానం బలపడుతోంది. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు అలెర్టయ్యారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతల విమర్శలను నిషితంగా పరిశీలించడం ప్రారంభించారు.
చంద్రబాబు తాజా ప్రత్యేక హోదా డిమాండ్ తో సోము వీర్రాజుకు దొరికిపోయారు. దీని గురించే ఎదురుచూస్తున్నట్టు సోము వీర్రాజు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయంటూ ఎద్దేవా చేసిన పార్టీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని ప్రశ్నించారు. గతంలో సీబీఐను రాష్ట్రానికి రానివ్వనని చెప్పిన చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఎలా ప్రశ్నిస్తారని ఎద్దేవా చేశారు. హోం మంత్రి అమిత్ షాపై రాళ్ల దాడి చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. విశాఖ రైల్వేజోన్ సాధించలేని చంద్రబాబు కేంద్రంపై ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ బ్లాక్ మెయిల్ కు దిగడం తగదన్నారు. కేంద్రం వద్ద చంద్రబాబు గుట్టు ఉందని.. వాటిని అవసరమైతే విప్పుతామని సోము వీర్రాజు హెచ్చరించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా పల్లవి, సోము వీర్రాజు ఫైర్ చూస్తుంటే రెండు పార్టీల మధ్య మళ్లీ అగాధం ప్రారంభమైందా? అన్న చర్చ నడుస్తోంది.