Pawankalyan : ఏపీలో అసలు సిసలు సంగ్రామానికి తెరలేచింది. పవన్ సమర శంఖారామం పూరించారు. వారాహితో అంకురార్పణ చేశారు. పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ముందుగా వైసీపీని గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఎన్నెన్నో సందేహాలను పటాపంచలు చేస్తూ వారాహి యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. నేటితో తొలివిడత యాత్ర ముగియనుంది. ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలకు అద్దంపట్టేలా పవన్ ప్రసంగాలు, ఇంటర్వ్యూలు సాగాయి. వైసీపీ విముక్త ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో అందరు కలవాల్సిందేనన్న అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశారు. అదే సమయంలో జనసేనను గెలిపించాలని.. తనతో పాటు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించాలని.. తనకు సీఎంగా ఒక చాన్స్ ఇవ్వాలని కోరడం ద్వారా తన భావి రాజకీయాల గురించి పవన్ చెప్పకనే చెప్పారు.
పవన్ స్ట్రాటజీ తెలియక వైసీపీ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. తొలిరోజు విడిగా వస్తానని చెప్పడంతో సంతోషపడ్డారు. సీఎంగా తనకు ఒక చాన్స్ ఇవ్వాలని కోరడంతో ఇక కూటమి కట్టరని భావించారు. జనసేనకు మాత్రమే ఓటేయ్యాలని కోరడంతో టీడీపీతో కలవరని అనుకున్నారు. కానీ అధికార పార్టీకి పవన్ ట్విస్టు ఇచ్చారు. వైసీపీ విమక్త ఏపీ కోసం అందర్నీ కలుపుకెళ్లనున్నట్టు ప్రకటించడంతో నేతల ఫ్యూజులు పగిలిపోయాయి. తాము ఆశించినది జరగకపోవడంతో వారు పవన్ పై విరుచుకుపడుతున్నారు. విడిగా వస్తానని చెప్పినప్పుడు సంతోషపడిన వారే.. కలిసి వస్తామని చెప్పడంతో కలహించడం ప్రారంభించారు.
జనసేనాని చర్యలు తెలియక కలుస్తామన్న తెలుగుదేశం పార్టీ సైతం హైరానాకు గురైంది. దాని ప్రీతిపాత్రమైన ఎల్లో మీడియా సైతం ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడింది. విడిగా వెళ్తాను, సీఎం చాన్స్ వంటి వాటిని కత్తిరించి వైసీపీ సర్కారుపై పవన్ చేసిన విమర్శలనే హైలెట్ చేసింది. పతాక శీర్షికన ఇవ్వాలా.. ప్రాధాన్యత తగ్గించాలా అని ఆలోచించింది. చివరకు అందర్నీ కలుపుకెళతానని పవన్ చెప్పడంతో ఖుషీ అయ్యింది. పవన్ ఇంటర్వ్యూలకు టాప్ ప్రయారిటీ ఇచ్చి ఎల్లో మీడియాగా తనకున్న సార్థక నామాన్ని నిజం చేసింది.
నిజానికి వీరికి పవన్ బలం తెలియంది కాదు. కానీ బలహీనుడిగా చూపాలి. జనం ముందు పలుచన చేయాలి. తమ రాజకీయాలకు పవన్ ను వాడుకోవాలి. పవన్ ఒంటరిగా పోటీచేయాలన్నది ఒకరి భావన. పవన్ తమతో కలవాలి కానీ..తమకే గరిష్ట లబ్ధి చేకూరాలన్నది మరొకరి కోరిక. అందుకే తన బలం చూపాలన్నదే పవన్ అభిమతం. తను లేనిదే ఏపీ రాజకీయం లేదని చూపించడానికే పవన్ ఈ ప్రయత్నం. పవన్ వ్యూహం పక్కాగా ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. విమర్శకులు సైతం అభినందిస్తున్నారు.