Pawankalyan – TDP Alliance : టీడీపీతో పొత్తుపై తేల్చేసిన పవన్.. సీఎంగా సిద్ధం

సీఎం అని తనవాళ్లు అనుకుంటే సరిపోదని.. అది ప్రజలు కూడా అనుకోవాలని పవన్ అభిప్రాయపడ్డారు. సీఎం పదవి ఒకేసారి వరిస్తుందా.. అంచెలంచెలుగా వస్తుందా అనేది చూడాలన్నారు.

Written By: Dharma, Updated On : June 21, 2023 9:25 am
Follow us on

Pawankalyan – TDP Alliance : జనసేనాని పవన్ గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వ్యూహాత్మకంగా, ఒక పద్ధతి ప్రకారం నడుచుకుంటున్నారు. పొత్తులతో పాటు భవిష్యత్ రాజకీయాలపై కూడా అచీతూచీ మాట్లాడుతున్నారు. ఎక్కడా తొందరపాటు ప్రదర్శించడం లేదు.పరిణితి ప్రదర్శిస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీతో పొత్తు, బీజేపీ కలిసి రావడంపై కూడా భిన్న ఆలోచనలతో ఉన్నారు. వారాహి యాత్రలో ఉన్న ఆయన వివిధ మీడియా సంస్థలకు ఇంట్వర్వ్యూలు ఇచ్చారు. ఎన్నికల్లో పొత్తులపై మాట్లాడుతూ వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదన్నదే తన అభిమతమన్నారు. అలా చెబుతూనే కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సైతం పోటీచేస్తామని చెప్పారు.

పొత్తులపై ఏకాభిప్రాయం అనేది కష్టసాధ్యమన్నారు. టీడీపీ, బీజేపీలను ఏకతాటిపైకి తేవడానికి ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లాలన్నది తన అభిమతంగా చెప్పుకొచ్చారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదు అంటే మూడో పార్టీల కలయిక అనివార్యమన్నారు. అది ఏ స్థాయిలో అన్నది తానొక్కడినే ప్రతిపాదించలేనని తేల్చేశారు. దీనికి అందరికీ ఆమోదయోగ్యమైన ఏకాభిప్రాయం కావాలన్నారు. ఎన్నికల నాటికి పొత్తులపై స్పష్టత వస్తుందని చెప్పారు. తన వైపు నుంచి క్లియర్ గా ఉన్నానని.. ఇప్పటికే చంద్రబాబును మూడుసార్లు కలిసిన విషయాన్ని గుర్తుచేశారు.

అటు తాను సీఎం పదవి కోరుతుండడంపై కూడా స్పందించారు. కొద్దిరోజుల కిందట వరకూ పదవులతో పనిలేదని.. వైసీపీ విముక్త ఏపీయే లక్ష్యమని పవన్ ప్రకటించారు. ఇప్పుడు అదే విషయంపై ప్రస్తావిస్తూ తాను సీఎం పదవిలో కూర్చోవాలని అభిమానుల ఆకాంక్ష అని.. దానిని తీర్చవలసిన అవసరం తనపై ఉందన్నారు. వారి అభిప్రాయాన్ని గౌరవించి మాత్రమే తాను సీఎంగా ఒక చాన్స్ ఇప్పించాలని కోరినట్టు చెప్పుకొచ్చారు.అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే నేను సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపినట్టు పవన్ చెప్పారు.

సీఎం అని తనవాళ్లు అనుకుంటే సరిపోదని.. అది ప్రజలు కూడా అనుకోవాలని పవన్ అభిప్రాయపడ్డారు. సీఎం పదవి ఒకేసారి వరిస్తుందా.. అంచెలంచెలుగా వస్తుందా అనేది చూడాలన్నారు. కోట్లాది మంది బాధ్యతలు మోసే పదవి కనుక.. దానికి అపారమైన అనుభవం కూడా అవసరమన్నారు. అందుకే తాను నిత్యం ప్రజా సమస్యలపై అధ్యయనం చేస్తున్నట్టు గుర్తుచేశారు. ఎన్నికల్లో ప్రజలు కుల,వర్గాలుగా విడిపోకుండా చూసుకోవాలన్నారు. తమ ఓటు ఉందా? లేదా? అని పరిశీలించుకోవాలన్నారు. చివరి వరకూ కాపాడుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ 18 శాతం ఓటు బ్యాంక్ కోల్పోవడం ఖాయమని పవన్ తేల్చిచెప్పారు. మొత్తానికైతే పవన్ పరిణితితో కూడిన వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.