Pawan Kalyan: జన సైనికులకు పవన్ సంచలన ఆదేశాలు

జూలై 1న సామాజిక పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపారు. అయితే టిడిపి శ్రేణులు తమను ఆహ్వానించలేదని జనసైనికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏకంగా సోషల్ మీడియాకు ఎక్కిన వారు సైతం ఉన్నారు. అలాగే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను వరుసగా కలిశారు. ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలను సైతం తీసుకెళ్లారు.

Written By: Dharma, Updated On : July 8, 2024 1:03 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించింది. సంపూర్ణ విజయాన్ని సొంతం చేసుకుంది. కూటమి గెలుపులో పవన్ క్రియాశీలక పాత్ర పోషించారు. పొత్తు కుదుర్చుకోవడం, ఓట్ల బదలాయింపు,పార్టీల మధ్య సమన్వయం.. ఇలా అన్ని అంశాల్లో పవన్ పెద్దన్న పాత్ర పోషించారు. పవన్ అనుకున్న స్థాయిలో ఫలితాలు వచ్చాయి. దీంతో పవన్ పరపతి అమాంతం పెరిగింది. అందుకే చంద్రబాబు సైతం పవన్ కు ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చారు. సీఎంతో సమానంగా హోదా కట్ట పెడుతూ చాలా విషయాల్లో పవన్ కు ఎనలేని గౌరవం ఇచ్చారు చంద్రబాబు. అందుకే జనసైనికులు సైతం ఖుషి అయ్యారు. అంతవరకు పరవాలేదు కానీ.. కొత్తగా లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు.పవన్ కు ప్రాధాన్యం లేదని.. ప్రాధాన్యం తగ్గిస్తున్నారని.. జన సైనికులకు పట్టించుకోవడంలేదని కొత్త విమర్శలు చేయడం ప్రారంభించారు. ఇది చికాకు అంశంగా మారడంతో పవన్ స్పందించాల్సి వచ్చింది.

* ఆ రెండింటి పైన విమర్శలు..
జూలై 1న సామాజిక పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిపారు. అయితే టిడిపి శ్రేణులు తమను ఆహ్వానించలేదని జనసైనికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏకంగా సోషల్ మీడియాకు ఎక్కిన వారు సైతం ఉన్నారు. అలాగే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను వరుసగా కలిశారు. ఏపీకి చెందిన ఎన్డీఏ ఎంపీలను సైతం తీసుకెళ్లారు. కానీ డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ తీసుకెళ్లలేదని జనసేన నుంచి అభ్యంతరాలు వచ్చాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా తన వెంట డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తీసుకెళ్లారు. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు తీరును కొంతమంది జన సైనికులు బాహటంగానే అభ్యంతరం తెలిపారు. అయితే ఏపీలో కూటమి ధర్మాన్ని పాటించడం లేదన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం మంత్రులు ఎవరి పని మీద వారు ఉన్నారు. సీఎంగా చంద్రబాబు తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. దీనిపై పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో జనసైనికులు అతిగా చేస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.

* ప్రత్యేక ప్రకటన..
రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి జనసేన శ్రేణులు వెన్నుదన్నుగా నిలవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ నిర్ణయాలకు అభ్యంతరాలు తెలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ప్రోటోకాల్ ఉల్లంఘించి అధికారిక సమావేశాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన వద్దని కూడా పవన్ సూచించారు. అలా చేస్తే నిబంధనల అతిక్రమణ కిందకే వస్తుందని.. అలాంటి వారిపై చర్యలు ఉంటాయని కూడా ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ తో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం పదేళ్లపాటు కొనసాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర పునర్నిర్మాణం దృష్ట్యా ఇది కీలకమని పవన్ భావిస్తున్నారు. అందుకే జనసేన శ్రేణుల దూకుడుకు కళ్లెం వేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రత్యేక ప్రకటన విడుదల చేసినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.