Pawan Kalyan: మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడు మంత్రివర్గంలోకి వెళ్తారు? ఆయనకు ఇచ్చే శాఖలు ఏంటి? హోంశాఖ ఇస్తారా? సినిమాటోగ్రఫీ శాఖ కేటాయిస్తారా? ఇలా బలమైన చర్చ నడుస్తోంది. మరోవైపు మార్చి వరకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదని కూడా ప్రచారం నడుస్తోంది. నేరుగా మంత్రిగా కంటే.. ఎమ్మెల్సీ అయిన తరువాత మంత్రి పదవి ఇవ్వాలని పవన్ పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు నాగబాబు కొద్ది రోజుల్లోనే మంత్రి పదవి తీసుకుంటారని కూడా ప్రచారం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలపై దృష్టి పెడతారని.. వీలైనంత త్వరగా వాటిని పూర్తి చేసే అవకాశం ఉందని.. అందుకే నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటారని మరో ప్రచారం అయితే మాత్రం ఉంది.
* అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే
ప్రస్తుతం పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. అవి వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించాల్సినవి. వీలైనప్పుడు సినిమా షూటింగ్లకు పవన్ హాజరవుతున్నారు. కానీ దానికి సమయం చాలడం లేదు. మరోవైపు పవన్ వద్ద పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి తో పాటు అటవీ శాఖ వంటి కీలక శాఖలు ఉన్నాయి. వాటికి పాలనాపరమైన సమయం ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. అందుకే సినిమా షూటింగ్లకు విలువైన సమయాన్ని కేటాయించలేకపోతున్నట్లు తెలుస్తోంది. నాగబాబు క్యాబినెట్లోకి వస్తే తనకు కొంత వెసులుబాటు దొరుకుతుందని పవన్ ఆశిస్తున్నట్లు సమాచారం. నాగబాబు మంత్రివర్గంలోకి వచ్చిన తరువాత కాస్త రిలాక్స్ అయినా సరే.. అన్ని సినిమాల షూటింగ్ లు పూర్తిచేయాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ఉన్నట్లు సమాచారం.
* నాగబాబుకు ఆ రెండు శాఖలు
పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. ఆపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణం వంటి ఐదు శాఖలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తన శాఖల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అన్నింటిని అధికారుల కే వదిలేయరు. తన ఆలోచనలకు తగ్గట్టు వ్యవహరిస్తుంటారు. అయితే ఇప్పుడు నాగబాబు ఎంట్రీ తో కీలకమైన అటవీ శాఖను ఆయనకు విడిచి పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మరోవైపు నాగబాబు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో.. సినిమాటోగ్రఫీ శాఖను ఆయనకే విడిచి పెడతారని తెలుస్తోంది. అయితే కందుల దుర్గేష్ వద్ద ఒక పర్యాటక శాఖ మిగులుతుంది. నాగబాబు కు సినిమాటోగ్రఫీ శాఖ వదిలిపెట్టనుండడంతో.. మరో శాఖను ఆయనకు సర్దుబాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరి అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.