Pawan Kalyan: ఒక వైపు విశాఖ ఖాళీ చేసి వెళ్లిపోవాలని పోలీసులు.. మరోవైపు పార్టీ క్రియాశీల నాయకులపై కేసులు… అదే సమయంలో తమ సమస్య చెప్పుకోవడానికి వచ్చిన వేలాది మంది జనాలు… ఇది విశాఖలో ఆదివారం జనసేనాని పవన్ కు ఎదురైన సమస్యలు. అయినా ఎంతో ఓపికతో, చతురతతో ముందుకు నడిచారు పవన్. తనకు నోటీసులు అందించడానికి వచ్చిన పోలీసులతో హుందాగా వ్యవహరిస్తునే అటు జనవాణి కార్యక్రమాన్ని జరిపించాలని పార్టీ నేతలను ఆదేశించారు. వివిధ కారణాలతో మృత్యువాత పడిన జన సైనికుల కుటుంబాలకు బీమా పరిహారం చెల్లించారు. నేనున్నా అంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. విశాఖలో జనవాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు పవన్ రావడం, వైసీపీ నేతల కవ్వింపు చర్యలు, తరువాత జనసైనికులపై కేసుల నమోదు ఘటనలు తెలిసిందే. అయితే ఈ విషయంలో పవన్ వ్యవహరించిన సమయస్ఫూర్తి సర్వత్రా అభినందనలు అందుకుంటోంది.

విశాఖ ఘటనల నేపథ్యంలో నెల రోజుల పాటు నగరంలో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని పోలీస్ శాఖ నిర్ణయించింది. డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలోని పోలీసు బృందం పవన్ బస చేసిన హోటల్ కు చేరుకుంది. అప్పటికే హోటల్ చుట్టూ 500 మంది పోలీసులు మోహరించారు. అయితే తన వద్దకు వచ్చిన పోలీసు అధికారులను పవన్ హుందాగా రిసీవ్ చేసుకున్నారు. మా కార్యకర్తల కుటుంబాలను ఆదుకొని నోటీసులు తీసుకుంటానని సంవినయంగా కోరారు. దీనికి పోలీసులు అంగీకరించారు. 12 మంది క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున.. మొత్తం రూ.60 లక్షలు అందించిన పవన్ తన ఉదారతను చాటుకున్నారు.
విశాఖలో గురువారం నాటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కష్టాలు నాకు రావొచ్చు.. పార్టీ నేతలపై కేసులు నమోదు కావొచ్చు. కానీ నన్ను నమ్ముకున్న కార్యకర్తలను, అభిమానులకు మాత్రం కష్టం రానివ్వనని జనసేనాని నిరూపించుకున్నారు. అందుకేనేమో పవన్ అంటే దేవుడంటారు. యువత ఎంతో ఇష్టపడతారు. సామాన్య మహిళలు కూడా తాము వీర మహిళలుగా చెప్పుకుంటూ పవన్ వెంట నడుస్తున్నారు. పండు ముసలి వారు పవన్ కు ఒక్క చాన్సివ్వాలని నిర్ణయానికి వస్తున్నారు. మొత్తానికైతే ప్రభుత్వం పవన్ కార్యక్రమాలను భగ్నం చేసినా.. జనసేనాని మాత్రం తన చతరుతతో గ్రాండ్ సక్సెస్ చేశారు. అటు జనవాణితో పాటు పార్టీ శ్రేణుల కుటుంబాలకు ఆర్థిక సాయమందించారు.,

ఉత్తరాంధ్రలో 12 మంది జన సైనికులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. ఇందులో విశాఖకు చెందిన తొమ్మిది మంది, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు, విజయనగరానికి చెందిన ఒకరు ఉన్నారు. వీరి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పవన్ ఆర్థికసాయమందించారు. దుర్గాసి దేవేంద్ర, హనుమంతు ఢిల్లేశ్వరరావు, సంగంరెడ్డి గంగరాజు, బోరా వెంకటలక్ష్మీ, మోటూరి గోవింద్, పవడా రమణ్ కుమార్, గొంతిని శ్రీను, పాతల అప్పారావు, కుంచా నూకరాజు, అనిశెట్టి శివ, సీంతరెడ్డి రాంబాబు, మల్లిరెడ్డి పద్మనాభం కుటుంబాలకు బీమా పరిహారం పంపిణీ చేశారు. వీరంతా జనసేన సభ్యత్వం ఉన్నవారు. వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. ఆర్థిక సాయం అందడంతో బాధిత కుటుంబ సభ్యులు జనసేనానికి జీవితాంత రుణపడి ఉంటామని వేదికపై ప్రకటించారు. మొత్తానికైతే పవన్ ను ప్రభుత్వం అడ్డుకున్నా ఆయన చెయ్యాలన్న పని నిశ్చింతగా పూర్తి చేయగలిగారు.