Pawan Kalyan: పొత్తులో భాగంగా జనసేన ఆశించినన్ని సీట్లు లభించలేదు. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సంతృప్తిగా కనిపిస్తున్నారు. కూటమిలో ఓట్ల బదలాయింపు పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తన మాటను వ్యతిరేకించేవారు తనవారు కాదని.. తన వారైతే తనకు మద్దతు తెలపాల్సిందేనని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అటు పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యక్రమాలు సాగించే వారికి సైతం హెచ్చరికలు జారీ చేశారు. తన వారు అని చెప్పుకుంటూ.. తన నిర్ణయాలను తప్పుపడుతున్న వారిని సైతం సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తాను పొత్తు పెట్టుకుంటున్నట్లు.. తనకు ఏ ఇతర అవసరాలు లేవన్నట్లు పవన్ చెప్పుకు రావడం విశేషం.
అయితే పవన్ ను వ్యతిరేకిస్తున్న వర్గాలు కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నాయి. పొత్తులో భాగంగా జనసేన కంటే టిడిపి ప్రయోజనాల కోసమే పవన్ పాటుపడుతున్నారంటూ కొత్త ప్రచారానికి తెర లేపారు. అందుకు కొన్ని ఉదాహరణలు చెబుతున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు మూడు పార్లమెంట్ స్థానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి కాకినాడ పార్లమెంట్ స్థానం. ఇక్కడ అభ్యర్థిగా సానా సతీష్ ఉన్నారు. ఇంతకుముందు ఆయన ఎన్నడూ జనసేన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పైగా లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా తేలింది. అంటే ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి. మచిలీపట్నం పార్లమెంట్ స్థానం సైతం జనసేనకు ఖరారు అయింది. అక్కడ నుంచి ఎంపీ బాలశౌరి పోటీ చేయనున్నారు. ఆయన కూడా ఇటీవలే జనసేనలో చేరారు. టిడిపిలో చేరతారని భావించారు. జనసేనలో చేరి ఎంపీ టికెట్ ను దక్కించుకొనున్నారు. ఈ లెక్కన ఆయన సైతం బయట వ్యక్తి. అనకాపల్లి ఎంపీ స్థానం సైతం జనసేనకు కేటాయించారు. అక్కడ నాగబాబు పోటీ చేయనున్నారు. ఆయన మాత్రం పార్టీ వ్యక్తి. అయితే బయట వ్యక్తులు, ఇటీవల పార్టీలో చేరిన వారు, తెలుగుదేశంతో సంబంధం ఉన్న వ్యక్తులకు టికెట్లు కట్టబెట్టడంతో జనసేనలో ఒక రకమైన అసంతృప్తి ఉంది.
మరోవైపు 24 అసెంబ్లీ స్థానాలకు గాను ఐదు చోట్ల జనసేన అభ్యర్థులను ప్రకటించారు. అక్కడ కూడా కొణతాల రామకృష్ణ లాంటి వ్యక్తి.. పార్టీతో ఎటువంటి సంబంధం లేని వారే.మరోవైపు ఈ ఐదు స్థానాలు సైతం వైసీపీ చేతిలో టిడిపి ఓడిపోయినవే. ఇప్పటికీ కూడా వైసిపి బలంగా ఉన్న నియోజకవర్గాలే. గత ఎన్నికల్లో జనసేన రెండో స్థానం నిలిచిన నియోజకవర్గాలు సైతం టిడిపికే కేటాయించారు. ఇవన్నీ జనసేనలో అసంతృప్తికి కారణాలుగా నిలుస్తున్నాయి.
ఇంకా పొత్తులో భాగంగా జనసేన 19 చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కనీసం ఈ సీట్లలోనైనా మెజారిటీ స్థానాలను జనసేన జెండా మోసిన వారికి అప్పగిస్తారా? లేదా? అన్న బలమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన లో చేరారు. ఆయనే నరసాపురం అభ్యర్థి అవుతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే గత పది సంవత్సరాలు నరసాపురం నియోజకవర్గంలో పార్టీ జెండా మోసిన వారి పరిస్థితి ఏంటి. దీనిపైనే ముప్పేట విమర్శలు ఎదురవుతున్నాయి. కనీసం ఆ 19 స్థానాల్లోనైనా.. జనసేన జెండా మోసిన నాయకులకు టిక్కెట్లు ఇస్తారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరే నాయకులకు టికెట్లు ఇస్తే మాత్రం.. పొత్తు లక్ష్యానికి విఘాతం తప్పదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చిన పవన్.. టికెట్ల కేటాయింపు విషయంలో మాత్రం నోరు తెరవడం లేదు. అదే జనసేనకు మైనస్ గా మారుతోంది.